అనుకున్నదే జరిగింది. టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
సిరాజ్ చేరిక టీమిండియా బౌలింగ్ బలాన్ని మరింత పెంచనున్నప్పటికీ.. ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా జట్టుకు దూరం కావడం ఒకింత మైనస్సే అవుతుంది. ఎందుకంటే.. హర్షిత్ లోయర్ ఆర్డర్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్దుడు. ఛేదనల్లో అతని ఇన్నింగ్స్‌లు చాలా కీలకమవుతాయి.
బౌలింగ్ విషయంలోనూ హర్షిత్ ఇటీవలకాలంలో మంచి మార్కులే కొట్టేశాడు. టీ20 జట్టుకు హర్షిత్ లాంటి ఆల్‌రౌండర్ చాలా కీలకం. మరోవైపు సిరాజ్ చేరిక కూడా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రూవెన్ బౌలర్. పైగా మంచి ఫామ్‌లో ఉన్నాడు.
గత వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులోనూ కీలకంగా వ్యవహరించాడు. హర్షిత్‌లా బ్యాటింగ్ చేయలేడన్నది తప్పిస్తే, సిరాజ్ లాంటి బౌలర్ జట్టుకు ఎప్పుడూ అదనపు బలమే. సిరాజ్ భారత్ తరఫున తన చివరి టీ20ని 2024 జులైలో శ్రీలంకతో ఆడాడు. సిరాజ్.. బుమ్రా, అర్షదీప్‌తో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. ఈ త్రయం మరోసారి భారత్‌కు ప్రపంచకప్ అందించాలని ఆశిద్దాం.
సుందర్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు
గాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని సిరాజ్‌తో భర్తీ చేసిన బీసీసీఐ.. మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రపంచకప్ జట్టులో ఉన్న సుందర్ చాలా రోజులుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబ్‌లో ఉన్నాడు.
సుందర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బీసీసీఐ సుందర్ విషయంలో ఇంకా వేచి చూడాలని భావిస్తుంది. కాబట్టే ఇంకా అతనికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు. ప్రపంచకప్ తదుపరి దశ సమయానికంతా సుందర్ కోలుకుంటాడని ఆశిద్దాం.
ఇదిలా ఉంటే, భారత్ ఇవాళ (ఫిబ్రవరి 7) ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తుది జట్టులో సిరాజ్‌కు తప్పక అవకాశం దొరుకుతుంది.
టీ20 ప్రపంచకప్‌కు అప్‌డేటెడ్ భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (విసి), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్


