ఊహాగానాలే నిజమయ్యాయి.. ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్టు.. అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి మ్యాచ్ అని వెల్లడించాడు.
పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఆస్ట్రేలియా తరఫున అనేక మ్యాచ్‌లు ఆడాను. ఇది నా అదృష్టం. పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింను నేను.
నాలాంటి వాళ్లు ఆసీస్ తరఫున ఎప్పటికీ ఆడలేరని చాలా మంది హేళన చేశారు. వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చూడండి నేను ఎక్కడ ఉన్నానో!.. మీరు కూడా నాలాగే అనుకున్నది సాధించగలరు. ఎంతో మందికి నేను ఆదర్శంగా నిలిచాననే భావిస్తున్నా’’ అని ఉస్మాన్ ఖవాజా పేర్కొన్నాడు.
వారి త్యాగాల కారణంగానే
‘‘సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు సమీపంలోనే మేము ఉండేవాళ్లము. నా చిన్నతనంలో... మైకేల్ స్లాటర్ రెడ్ ఫెరారీలో వెళ్తున్నపుడు అలా చూస్తూ ఉండిపోయేవాడిని. నేనూ అతడి మాదిరే క్రికెటర్ అయితే బాగుండు అని అనుకునేవాడిని. మా అమ్మానాన్న మా కోసం ఆస్ట్రేలియాకు వచ్చి ఇక్కడే బతుకుదెరువు చూసుకున్నారు.
ఏదో ఒకరోజు నేనూ టెస్టు క్రికెటర్ అయ్యి.. నా సొంతకారులో పయనించగలనని గట్టిగా నమ్మాను. నా ప్రయాణంలో నా తల్లిదండ్రుల పాత్ర కీలకం. వారి త్యాగాల కారణంగానే నేను ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగాను.
మూల్యం చెల్లించాను నాన్నా!
నేను ఎన్నోసార్లు నిరాశకు గురయ్యేవాడిని. అప్పుడు మా అమ్మ ‘నువ్వు చేయగలవు’ అంటూ నాలో స్ఫూర్తి నింపేది. ఆసీస్ తరఫున తప్పక క్రికెట్ ఆడతానని మా నాన్న తరచూ చెప్పేవాడు. ఉన్నదంతా పాకిస్తాన్‌లో వదిలేసి.. మా భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చిన మీకు 88 టెస్టుల రూపంలో మూల్యం చెల్లించాను నాన్నా!
జీవితంలోని గొప్ప వరం తనే
నా భార్య రేచల్. తను లేకుండా అసలు ఈ ప్రయాణమే లేదు. జీవితంలోని గొప్ప వరం తనే. నేను నా కల వెంట పరుగులు తీస్తుంటే.. తను కుటుంబాన్ని నిలబెట్టింది. బాధ్యతలు తన భుజాన వేసుకుంది. తనకు నేనెంతో రుణపడి ఉన్నాను.
పేరుపేరునా ధన్యవాదాలు
గత పదేళ్లుగా రేచల్ తల్లిదండ్రులు కూడా మాకు మద్దతుగా నిలిచారు. వారికి ధన్యవాదాలు. ఇలాంటి వ్యక్తులు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. నా సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది.. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నా కలను నెరవేర్చుకునే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను’’ అంటూ 39 ఏళ్ల ఉస్మాన్ ఖవాజా కన్నీటి పర్యంతమయ్యాడు.
మొదలైన చోటే ముగింపు
కాగా 2011లో ఆస్ట్రేలియా తరఫున ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. తన కెరీర్‌లో ఇప్పటికి 88 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
టెస్టుల్లో ఇప్పటికి 16 సెంచరీల సాయంతో 6206 పరుగులు సాధించిన ఉస్మాన్ ఖవాజా.. వన్డేల్లో 1554 రన్స్ రాబట్టాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. ఇక ఆసీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో 241 పరుగులు చేయగలిగాడు. సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జనవరి 4-8 మధ్య జరిగే ఐదో టెస్టు ఖవాజా కెరీర్‌లో చివరి (Test Cricket Retirement)ది కానుంది. ఎక్కడైతే తన ప్రయాణం మొదలైందో.. అక్కడే పదిహేనేళ్ల తర్వాత కెరీర్ ముగియనుంది.
చదవండి: 2026లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న ఐదుగురు భారత క్రికెటర్లు


