2026లో టీమిండియాలోకి చాలామంది యువకులు వచ్చే అవకాశం ఉంది. వయసు మీద పడటం, అవకాశాలు రాకపోవడం వంటి కారణాల చేత పలువురు వెటరన్ స్టార్లు ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి స్థానాలు భర్తీ చేసే క్రమంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు వస్తాయి. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్కు దగ్గర పడిన ఐదుగురు టీమిండియా వెటరన్ స్టార్లపై ఓ లుక్కేద్దాం.
ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు మహ్మద్ షమీ. కారణం ఏదైనా షమీకి ఇటీవలికాలంలో అవకాశాలు రావడం లేదు. అతను పూర్తి ఫిట్నెస్ సాధించి, దేశవాలీ టోర్నీల్లో రాణిస్తున్నా సెలెక్టర్లు చిన్నచూపు చూస్తున్నారు. ప్రస్తుతం షమీ వయసు 35 ఏళ్లు. ఏ రకంగా చూసినా షమీ ఎన్నో రోజుల ఆటలో కొనసాగే అవకాశం లేదు. అవకాశాలు వచ్చినా ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి లేదు. సాధారణంగానే ఫాస్ట్ బౌలర్లకు కెరీర్ స్పాన్ తక్కువ. 35 ఏళ్ల వచ్చాయంటే రిటైర్మెంట్ స్టేజీలో ఉన్నట్లే. ఈ లెక్కన షమీ ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న రెండో వెటరన్ స్టార్ అజింక్య రహానే. రహానే అధికారికంగా ఆటకు వీడ్కోలు పలకకపోయినా, వయసు మీద పడటం చేత ఇప్పటికే అన్ అఫీషియల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం రహానే వయసు 37 ఏళ్లు. అతను మొదటి నుంచి టెస్ట్ ఫార్మాట్ ప్లేయర్‌గానే మిగిలిపోయాడు. ప్రస్తుత భారత టెస్ట్ జట్టు పరిస్థితి చూస్తే రహానేకు అవకాశం దక్కడం అసంభవం. రహానే ఆడే మిడిలార్డర్లో బెర్త్‌ల కోసం పదుల సంఖ్యలో పోటీ ఉంది. ఈ లెక్కన ఈ ఏడాది ముందుగా రిటైర్మెంట్ ప్రకటించే టీమిండియా వెటరన్ రహానే కావచ్చు.
ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న మరో భారత వెటరన్ స్టార్ యుజ్వేంద్ర చహల్. చహల్ 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత దాదాపుగా కనుమరుగైపోయాడు. యువ స్పిన్నర్లు బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ రాణిస్తుండటం చహల్కు మైనస్ అయిపోయింది. చహల్ బౌలింగ్‌లో అద్భుతాలు చేయగలిగినా బ్యాటింగ్లో మాత్రం తేలిపోతాడు.
ఇదే అతని కెరీర్ను ఎండ్ కార్డ్ పడేలా చేస్తుంది. మరోవైపు వయసు పైబడటం, యువకులతో పోటీ కూడా చహల్కు మైనస్ అవుతున్నాయి. ప్రస్తుతం అతని వయసు 35. వయసును పక్కన పెట్టినా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి అడ్డంకులను దాటుకొని రావాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. కాబట్టి ఈ ఏడాదే చహల్ కెరీర్‌కు కూడా ఎండ్ కార్డ్ పడవచ్చు.
ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న నాలుగో క్రికెటర్ రవీంద్ర జడేజా. జడేజా ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డే, టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతానికి జట్టులో అతని స్థానానికి ఢోకా లేనప్పటికీ.. వయసు పైబడటం దృష్ట్యా అతనే స్వచ్చందంగా ఆటకు వీడ్కోలు పలకవచ్చు. ఇప్పటికే అతని వారసుడిగా అక్షర్ పటేల్ ప్రమోట్ అయ్యాడు. జడ్డూ ఈ ఏడాది టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా వన్డేల నుంచైనా తప్పుకునే అవకాశం ఉంది.
ఈ ఏడాది షాకింగ్ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్న భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు. స్కై ఇటీవలికాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్గా అద్భుతాలు చేస్తున్నా, వ్యక్తిగతంగా విఫలమవుతుండటంతో ఇప్పటికే అతని ఉనికి ప్రమాదంలో పడింది. స్కై గత 19 ఇన్నింగ్స్‌లో 13.62 సగటున కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. విపరీతమైన పోటీ ఉన్న భారత టీ20 జట్టులో స్కై ఎక్కువ రోజులు కొనసాగడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఫిబ్రవరిలో జరిగే ప్రపంచకప్ తర్వాత స్కై రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.


