పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ | ACC Women's Asia Cup Rising Stars 2026: India A beat pakistan A by 8 wickets | Sakshi
Sakshi News home page

పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌

Feb 15 2026 3:26 PM | Updated on Feb 15 2026 4:00 PM

ACC Women's Asia Cup Rising Stars 2026: India A beat pakistan A by 8 wickets

ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టీ20 టోర్నీలో భారత్‌ పాక్‌పై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్‌ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ‌ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను భారత బౌలర్లు 93 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూల్చారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా (10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి) ఛేదించారు. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌-ఏలో రెండో స్థానానికి చేరింది. దీనికి ముందు మ్యాచ్‌లో భారత అమ్మాయిలకు యూఏఈ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.

తాజా మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. సైమా ఠాకోర్‌ (4-0-14-2), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (3-0-11-2), ప్రేమా రావత్‌ (3-0-16-2), జింటిమణి కలిట (3-0-18-1), మిన్నూ మణి (2.5-0-10-1), తనూజా కన్వర్‌ (3-0-19-0) పాక్‌ ప్లేయర్ల భరతం పట్టారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో షావల్‌ జుల్ఫికర్‌ (23), గుల్‌ రుఖ్‌ (21), అనోశా నాసిర్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ తొలి బంతికే వికెట్‌ (హుమైరా ఖాజీ డకౌట్‌) కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్‌ వ్రింద దినేశ్‌ (55) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి భారత్‌ను విజయతీరాలకు చేరింది. వ్రిందకు అనుష్క శర్మ (24), తేజల్‌ హసబ్నిస్‌ (12 నాటౌట్‌) సహకరించారు. 

పాక్‌ బౌలర్లలో వహీదా అక్తర్‌, మొమినా రియాసత్‌కు తలో వికెట్‌ దక్కింది. భారత్‌ గ్రూప్‌ దశలో తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 17న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్‌, పాక్‌, యూఏఈ, నేపాల్‌ గ్రూప్‌-ఏలో ఉండగా.. థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మలేసియా గ్రూప్‌-బిలో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement