పాక్‌ కోరిక నెరవేరుస్తాం: సూర్యకుమార్‌ | If Pakistan Want Abhishek To Play: Suryakumar On Salman Agha Wish | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ కోరిక నెరవేరుస్తాం.. రెండు మార్పులు!: సూర్యకుమార్‌

Feb 15 2026 3:18 PM | Updated on Feb 15 2026 3:47 PM

If Pakistan Want Abhishek To Play: Suryakumar On Salman Agha Wish

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ కొలంబో వేదికగా ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఆర్‌.ప్రేమదాస స్టేడియం వేదిక కాగా.. వర్షం పడే ప్రమాదం పొంచి ఉంది.

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) శనివారం నాటి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌ తొలుత అమెరికాతో తలపడిన సంగతి తెలిసిందే.

అభిషేక్‌ శర్మ గోల్డెన్‌ డకౌట్‌
ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా.. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గోల్డెన్‌ డకౌట్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక నమీబియాతో రెండో మ్యాచ్‌కు ఈ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ అందుబాటులో లేకుండా పోయాడు. కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన అభిషేక్‌.. కోలుకున్నప్పటికీ యాజమాన్యం అతడికి విశ్రాంతినిచ్చింది.

ఇక నమీబియాను చిత్తుగా ఓడించి సూపర్‌-8కు చేరువైన భారత్‌.. దాయాదిపై ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌తో ఆడే భారత తుదిజట్టు ఎలా ఉండబోతున్న చర్చ జరుగుతోంది.

అతడు ఆడాలని కోరుకుంటున్నాం
ఇదిలా ఉంటే.. భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (Salman Agha) మాట్లాడుతూ.. “అతడు మంచి ప్లేయర్‌. అభిషేక్‌ రేపు ఆడతాడనే అనుకుంటున్నాం. మేము అత్యుత్తమ జట్టుతో పోటీ పడాలి అని అనుకుంటున్నాం. కాబట్టి అతడు కోలుకుని తిరిగి వస్తే బాగుంటుంది’’ అని అభిషేక్‌ శర్మను ఉద్దేశించి పేర్కొన్నాడు.

పాక్‌ కోరిక నెరవేరుస్తాం
ఇదే విషయాన్ని సూర్య వద్ద విలేకరులు ప్రస్తావించగా.. “ఒకవేళ పాకిస్తాన్‌ మేము అభిషేక్‌ శర్మను ఆడించాలని కోరుకుంటే.. వారి కోరిక నెరవేరుతుంది. అతడు రేపు ఆడతాడు’’ అని సమాధానమిచ్చాడు. తద్వారా సంజూ శాంసన్‌పై వేటు వేయడం ఖాయమని చెప్పకనే చెప్పాడు సూర్య.

అతడికీ చోటు
ఇక కొలంబో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ కాబట్టి లెఫ్టార్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా తుదిజట్టులో ఉంటాడని సూర్య సంకేతాలు ఇచ్చాడు. “అతడి అవసరం ఉందనుకుంటే కచ్చితంగా ఆడిస్తాము’’ అని కుల్దీప్‌ను ఉద్దేశించి పేర్కొన్నాడు. కాగా అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో కుల్దీప్‌ వచ్చే అవకాశం ఉంది.

కాగా గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌లతో పాటు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ పోటీ పడుతున్నాయి. అయితే, ఇప్పటికే చెరో రెండు విజయాలతో భారత్‌- పాక్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. అమెరికా సైతం సూపర్‌-8 రేసులో నిలిచే ప్రయత్నంలో ఉంది.

భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ తుది జట్లు (అంచనా): 
భారత్‌
సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, ఇషాన్‌ కిషన్ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్ పటేల్‌, కుల్దీప్ యాదవ్‌, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా

పాకిస్తాన్‌
సల్మాన్‌ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్‌ అయూబ్, బాబర్‌ ఆజమ్, షాదాబ్ ఖాన్‌, ఉస్మాన్ ఖాన్‌ (వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ నవాజ్, ఫహీమ్ అష్రఫ్‌, షాహిన్‌ అఫ్రిది, ఉస్మాన్‌ తారిఖ్, అబ్రార్‌ అహ్మద్‌. 

చదవండి: IND vs PAK: ‘​వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement