టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇప్పటికే రెండు సంచలనాలు నమోదయ్యాయి. టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన ఇటలీ.. మూడోసారి వరల్డ్‌కప్ ఆడుతున్న నేపాల్‌ను ఓడించింది. ఇక మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే షాకిచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చాంపియన్ జట్టును ఓడించింది.
ఇక తాజాగా గ్రూప్-సిలో భాగంగా ఇంగ్లండ్‌కు పసికూన స్కాట్లాండ్ చెమటలు పట్టించింది. నేపాల్‌తో మ్యాచ్‌లో ఎలాగోలా గట్టెక్కిన బ్రూక్ బృందం.. స్కాటిష్ జట్టుపైనా అదే రీతిలో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.
ఈరోజు కూడా గెలుపు గీత దాటేశాము
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టామ్ బాంటన్ (Tom Banton)ను ప్రశంసించాడు. అదే విధంగా జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) సైతం మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. "ఈరోజు కూడా మేము గెలుపు గీతను దాటేశాము. పట్టలేనంత సంతోషం.
మా స్పిన్ బౌలింగ్‌లో స్కాట్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఆ సమయంలో వారు మాకంటే ముందంజలో నిలిచారు. అయితే, మేము తిరిగి పుంజుకున్నాం. ఆర్చర్ తన మ్యాజిక్ చూపించాడు.
జాగ్రత్తగానే ఉంటాము
ఇక లక్ష్య ఛేదనలో బాంటన్ అద్భుతం చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి గొప్పగా ఆడాడు. కోల్‌కతా వికెట్ బాగుంది. సామ్ కర్రాన్ సైతం కాసేపు మెరుపులు మెరిపించాడు. మా చివరి మ్యాచ్‌లో ఇటలీతో తలపడతాం. వాళ్లతో జాగ్రత్తగానే ఉంటాము’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. కాగా కోల్‌కతా వేదికగా శనివారం ఇంగ్లండ్- స్కాట్లాండ్ తలపడ్డాయి.
వణికించిన పసికూన
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (32 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మైకేల్ జోన్స్ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లు రషీద్ (3/36), ఆర్చర్ (2/24), డాసన్ (2/34) స్కాట్లాండ్ బ్యాటర్ల పనిపట్టారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి గెలిచింది. ఆరంభమైన తొలి ఓవర్లో సాల్ట్ (2), రెండో ఓవర్లో బట్లర్ (3)... ఇలా ఇద్దరు మేటి హిట్టర్లను 13 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో బెథెల్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు.
గెలిపించిన బాంటన్
అయితే జట్టు స్కోరు 79 వద్ద బెథెల్, కాసేపటికే కెప్టెన్ బ్రూక్ (4) వికెట్లు పారేసుకోవడంతో మళ్లీ 86/4 స్కోరు వద్ద ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. దీంతో జట్టును గెలిపించే బాధ్యతను పూర్తిగా తన భుజాన వేసుకున్న టామ్ బాంటన్ (41 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో గెలిపించాడు.
బాంటన్‌కు తోడు సామ్ కరన్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు), జాక్స్ (16 నాటౌట్)లు రాణించారు. ఫలితంగా ఇంకో 10 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మెక్‌ములెన్, క్యూరి, వీల్, లీస్క్ తలా ఒక వికెట్ తీశారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తమ రెండోమ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.
History made! ✍️
England register their first-ever T20 World Cup win over a European side with a solid five-wicket victory over Scotland. 👏
Up next ➡️ ICC Men’s #T20WorldCup | #NZvSA | LIVE NOW 👉 https://t.co/QWNvn10eTj pic.twitter.com/mscD1rxSmH— Star Sports (@StarSportsIndia) February 14, 2026
చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’


