ఇంగ్లండ్‌ను వణికించిన నేపాల్‌ | England defeated Nepal by 4 runs in the T20 World Cup | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ను వణికించిన నేపాల్‌

Feb 9 2026 2:59 AM | Updated on Feb 9 2026 2:59 AM

England defeated Nepal by 4 runs in the T20 World Cup

4 పరుగులతో గట్టెక్కిన హ్యారీ బ్రూక్‌ బృందం  

ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో చిన్న జట్ల జోరు సాగుతోంది. తొలి రోజు పాకిస్తాన్‌పై నెదర్లాండ్స్‌ గెలిచినంత పనిచేయగా... స్టార్‌లతో నిండి ఉన్న టీమిండియాను అమెరికా భయపెట్టింది. రెండో రోజు ఇదే తరహాలో రెండుసార్లు చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టును నేపాల్‌ వణికించింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. 

నేపాల్‌ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు చక్కటి షాట్‌లు ఆడుతూ జట్టులో ఆశలు రేపిన లోకేశ్‌ బామ్‌... స్యామ్‌ కరన్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌లు ఆడలేకపోయాడు. ఫలితంగా ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ ఇంగ్లండ్‌ 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. 

గ్రూప్‌ ‘సి’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్‌ బెథెల్‌ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెపె్టన్‌ హ్యారీ బ్రూక్‌ (32 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (18 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ఆఖర్లో మెరుపు షాట్‌లు ఆడగా... జోస్‌ బట్లర్‌ (26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఫిల్‌ సాల్ట్‌ (1), టామ్‌ బాంటన్‌ (2), స్యామ్‌ కరన్‌ (2) విఫలమయ్యారు. నేపాల్‌ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. 

దీపేంద్ర సింగ్‌ (29 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ రోహిత్‌ పౌడెల్‌ (34 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లోకేశ్‌ బామ్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్‌ (29; 4 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడారు. నేపాల్‌ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో... ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో లోకేశ్‌ రెండు సిక్స్‌లతో కలిపి 22 పరుగులు వచ్చాయి. 

తదుపరి ఓవర్‌లో మరో రెండు ఫోర్‌లతో లోకేశ్‌ 14 పరుగులు రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులకు చేరగా... స్యామ్‌ కరన్‌ ఆఖరి ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చి నేపాల్‌ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు.  

టి20 ప్రపంచకప్‌లో నేడు
స్కాట్లాండ్‌ X ఇటలీ
వేదిక: కోల్‌కతా; ఉదయం 11 గంటల నుంచి
జింబాబ్వే X ఒమన్‌
వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గంటల నుంచి
దక్షిణాఫ్రికా X  కెనడా 
వేదిక: అహ్మదాబాద్‌; 
రాత్రి 7 గంటల నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement