T20 WC 2026: పాక్‌తో మ్యాచ్‌.. టీమిండియాలో రెండు మార్పులు..? | Abhishek Sharma In, Sanju Samson Out.. Gautam Gambhir To Drop Arshdeep In IND vs PAK | Sakshi
Sakshi News home page

T20 WC 2026: పాక్‌తో మ్యాచ్‌.. టీమిండియాలో రెండు మార్పులు..?

Feb 15 2026 4:44 PM | Updated on Feb 15 2026 5:10 PM

Abhishek Sharma In, Sanju Samson Out.. Gautam Gambhir To Drop Arshdeep In IND vs PAK

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్‌-పాక్‌ మధ్య హైవోల్టేజీ మ్యాచ్‌ జరుగనుంది. కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్‌ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొని ఉండేవి. బంగ్లాదేశ్‌కు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ మ్యాచ్‌ రద్దు చేసుకున్నట్లు పాక్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్‌ ఈ మ్యాచ్‌ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్‌ తిరిగి కార్యరూపం దాల్చడం​ ఈ మ్యాచ్‌ హైప్‌ను మరింత పెంచింది. ఓ పక్క క్రికెట్‌ అభిమానులు ఈ హైవోల్టేజీ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్‌ సమయంలో భారీ వర్షం​ పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

మ్యాచ్‌ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే మాత్రం భారత్‌, పాక్‌కు చెరో పాయింట్‌ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్‌ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్‌ను సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్‌లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు (8-1).

ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతూ, నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్న అభిషేక్‌ శర్మ జట్టులో తిరిగి రానున్నాడని సమాచారం. అభిషేక్‌ రాకతో సంజూ శాంసన్‌ తిరిగి బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. 

ప్రేమదాస స్టేడియం పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించనుందన్న సమాచారం ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం​ ఉంది. అప్పుడు అర్షదీప్‌ సింగ్‌పై వేటు పడవచ్చు. అతని స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వస్తాడు. ఈ రెండు మార్పులు మినహా మిగతా జట్టు యధాతథంగా కొనసాగుతుంది.

అభిషేక్‌, ఇషాన్‌ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. వన్‌డౌన్‌లో తిలక్‌ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్‌ సూర్యకుమార్‌, ఐదో ప్లేస్‌లో హార్దిక్‌ పాండ్యా, ఆరో స్థానంలో శివమ్‌ దూబే, ఏడో ప్లేస్‌లో రింకూ సింగ్‌, స్పిన్నర్లుగా కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, ఏకైక స్పెషలిస్ట్‌ పేసర్‌గా బుమ్రా బరిలోకి దిగవచ్చు. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement