క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ హాట్ టాపిక్‌గా నిలిచాడు.
అతడి బౌలింగ్ శైలి భిన్నంగా అందుకు కారణం. బౌలింగ్ చేసే సమయంలో కొన్ని సెకన్లు ఆగి బంతిని విడుదల చేయడం అతడి స్పెషాలిటి. ఇప్పటివరకు భారత బ్యాటర్లు ఒక్కరు కూడా అతడి బౌలింగ్‌ను ఒక్కసారి కూడా ఎదుర్కొలేదు. దీంతో ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అతడిని భారత బ్యాటర్లు ఎలా ఆడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉస్మాన్ కోసం టీమిండియా బ్యాటర్లు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే తారిక్ భారత్‌పై పైచేయి సాధించాడని హఫీజ్ అన్నాడు.
"ఉస్మాన్ తారిక్ ఇప్పటికే భారత్‌పై సైకిలాజికల్‌గా విజయం సాధించాడు. ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం, బాబర్ అజామ్ లేదా మరెవరి గురించి ఎవరూ చర్చించడం లేదు. మీడియా, ఫ్యాన్స్ అంతా తారిఖ్ గురించే మాట్లాడుతున్నారు. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా తారిఖ్ పట్ల ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
అతడు పాకిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయినప్పటికి అతడిని ఎదుర్కొవడానికి భారత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ను కెప్టెన్ సల్మాన్ అఘా ఎలా ఉపయోగిస్తాడో చూడాలనుకుంటున్నాను. అతడిని 6వ ఓవర్‌లోనే రంగంలోకి దించితే బ్యాటర్లను కట్టడి చేయవచ్చు" అని తప్మాడ్ అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్ పేర్కొన్నాడు.


