ఆసీస్‌ గడ్డపై జూలు విదిల్చిన టీమిండియా.. తొలి టీ20లో ఘన విజయం | India Women tour of Australia 2026: India beat australia by 21 runs in first T20I | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ గడ్డపై జూలు విదిల్చిన టీమిండియా.. తొలి టీ20లో ఘన విజయం

Feb 15 2026 5:25 PM | Updated on Feb 15 2026 5:59 PM

India Women tour of Australia 2026: India beat australia by 21 runs in first T20I

2026 ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి టీ20లో టీమిండియా 21 పరుగుల తేడాతో (డ​క్‌వర్త్‌ లూయిస్‌ వద్దతిలో) గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు జూలు విదిల్చారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చారు. పేసర్లు రేణుకా సింగ్‌ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్‌ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్‌ ప్లేయర్ల భరతం​ పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో జార్జియా వేర్హమ్‌ (30) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (26), ఎల్లిస్‌ పెర్రీ (20), జార్జియా వాల్‌ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్‌ మూనీ (5), ఆష్లే గార్డ్‌నర్‌ (4), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (3), కిమ్‌ గార్త్‌ (2), డార్సీ బ్రౌన్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్‌ సోఫీ మోలినెక్స్‌ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.

అనంతరం భారత్‌ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వరుణుడు పలు మార్పులు ఆటంకం కలిగించాడు. జట్టు స్కోర్‌ 50-1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా.. భారీ వర్షం​ ప్రారంభమై, ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన భారత్‌ను విజేతగా ప్రకటించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ (11 బంతుల్లో 21; ఫోర్‌, 2 సిక్సర్లు) సహజ శైలిలో విరుచుకుపడింది. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి స్మృతి మంధన (16), జెమీమా రోడ్రిగ్స్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. షఫాలీ వికెట్‌ మోలినెక్స్‌కు దక్కింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఫిబ్రవరి 19న కాన్‌బెర్రా వేదికగా జరుగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement