ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల దాటికి 18 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది.
కంగారూ జట్టు బ్యాటర్లలో జార్జియా వేర్‌హామ్(30) టాప్ స్కోరర్‌గా నిలవగా, లిచ్‌ఫీల్డ్(26), పెర్రీ(20) రాణించారు. భారత పేసర్ అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించింది. అరుధతితో పాటు మరో తెలుగు అమ్మాయి శ్రీ చరణి, పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు సాధించారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ తన మెరుపు బ్యాటింగ్‌తో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. షఫాలీ కేవలం 11 బంతుల్లోనే 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి ఔటైంది. అయితే భారత్ స్కోర్ 50/1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.
వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. ఆట నిలిచిపోయే సమయానికి 21 పరుగులు ముందుంజలో ఉండడంతో భారత్‌ను విజేతగా నిర్ణయించారు. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి హర్మన్ సేన దూసుకెళ్లింది. రెండో టీ20 కాన్‌బెర్రా వేదికగా ఫిబ్రవరి 19న జరగనుంది.


