టీమిండియాతో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన | Sophie Molineux replaces Healy in Australia Women's T20I squad | Sakshi
Sakshi News home page

IND vs AUS: టీమిండియాతో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

Jan 29 2026 10:01 AM | Updated on Jan 29 2026 10:26 AM

Sophie Molineux replaces Healy in Australia Women's T20I squad

భారత మహిళలతో జరగనున్న మల్టీ-ఫార్మాట్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించింది. ఆసీస్ టీ20 కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ ఎంపికైంది. భారత్‌తో సిరీస్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు అలిస్సా హీలీ రిటైర్మెంట్ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఆమె వారసురాలిగా మోలినెక్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

ప్రస్తుత సిరీస్‌లో టీ20 జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్న మోలినెక్స్‌.. అనంతరం మూడు ఫార్మాట్లలో జట్టు పగ్గాలను చేపట్టనుంది. ఆసీస్ జట్టులో సీనియర్లు ఆష్లీ గార్డనర్, తహిలియా మెక్‌గ్రాత్ వంటి సీనియర్లు ఉన్నప్పటికి మోలినెక్స్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్‌గా మోలినెక్స్ విజయవంతం కావడంతో ఇప్పుడు జాతీయ జట్టును నడిపించే అవకాశం దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో విక్టోరియా జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది.

ఇక భారత్ టెస్టు సిరీస్‌కు ఆసీస్ జ‌ట్టులో యువ ఆల్‌రౌండ‌ర్ లూసీ హామిల్ట‌న్‌కు సెలెక్ట‌ర్లు చోటిచ్చారు. హామిల్ట‌న్ ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో కేవ‌లం 15 ఏళ్ల వ‌య‌స్సులోనే క్వీన్స్‌ల్యాండ్ త‌ర‌పున అరంగేట్రం చేసి చ‌రిత్ర సృష్టించింది. ఆ త‌ర్వాత బిగ్ బాష్ లీగ్‌లో కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్ర‌స్తుతం ఆమె డ‌బ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. టీ20ల్లో చోటు దక్కని స్పిన్నర్ అలానా కింగ్‌కు వన్డే జట్టులో సెల‌క్ట‌ర్లు అవ‌కాశ‌మిచ్చారు. అదేవిధంగా గాయం కార‌ణంగా డ‌బ్ల్యూపీఎల్ మ‌ధ్య‌లోనే వైదొలిగిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌కు భార‌త్‌తో సిరీస్‌లకు ఎంపిక చేసిన జ‌ట్టులో చోటు ద‌క్క‌డం గ‌మ‌నార్హం. ఫిబ్రవరి 15 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.

ఆసీస్ టీ20 జ‌ట్టు
డార్సీ బ్రౌన్, నికోలా కేరీ, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అనబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.

ఆసీస్ వ‌న్డే జ‌ట్టు
డార్సీ బ్రౌన్, నికోలా కేరీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, తహిలియా మెక్‌గ్రాత్, ఎల్లీస్ పెర్రీ, అనబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.

ఆసీస్ టెస్టు జ‌ట్టు
డార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, తహిలియా మెక్‌గ్రాత్, ఎల్లీస్ పెర్రీ, అనబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement