పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆటలోని అన్నీ ఫార్మాట్‌ల నుంచి అతడు తప్పుకుంటున్నట్లు ఆదివారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. 2023లో చివరిసారిగా ఆ్రస్టేలియాతో టెస్టు మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్... జాతీయ సెలెక్షన్ కమిటీ మెంబర్‌గా, పాకిస్తాన్ అండర్–19 జట్టు మెంటార్‌గా వ్యవహరించాడు.
త్వరలో అతడు పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో... తాజాగా కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. 38 ఏళ్ల సర్ఫరాజ్ జూనియర్ స్థాయిలో 2006లో అండర్–19 ప్రపంచకప్ అందించడంతో పాటు... 2017 చాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టును విజేతగా నిలిపాడు.
కెరీర్‌లో 54 టెస్టులాడి 3031 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... 117 వన్డేల్లో 2315 పరుగులు, 61 టి20ల్లో 818 పరుగులు చేశాడు. గతేడాది అజహర్ మెహమూద్ పాకిస్తాన్ టెస్టు జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించగా... అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఇప్పుడా స్థానాన్ని సర్ఫరాజ్ భర్తీ చేయనున్నాడు.
చదవండి: ఐపీఎల్ సృష్టికర్త రీ ఎంట్రీ!?


