ఐపీఎల్ సృష్టికర్త, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ.. తిరిగి ఈ క్యాష్ రిచ్ లీగ్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి పాలకమండలి సభ్యునిగా కాకుండా.. ఓ జట్టు సహా యజమానిగా రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో మోదీ భాగస్వామిగా చేరేందుకు ఆసక్తి చూపుతున్నాండంట. రాజస్తాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బడాలే జట్టులోని తన వాటాను విక్రయించేందుకు సిద్దమయ్యాడు. రాయల్స్‌లో ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ ఆధినేత అయిన మనోజ్ బడాలే 65 శాతం వాటాను కలిగి ఉన్నాడు.
మరో 35 శాతం వాటాను గెర్రీ కార్డినాల్(15 శాతం) , లాచ్లాన్ ముర్డోక్(13), కల్ సోమాని, టైగర్ గ్లోబల్, సంస్థ కలిగి ఉన్నాయి. అయితే లలిత్ మోదీ ఇప్పటికే మైనారిటీ వాటా కలిగిన కల్ సోమానితో కలిసి బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ విక్రయానికి సంబంధించి మార్చి 16న లండన్‌లో కీలకమైన చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో మోదీ,సోమాని బృందం పాల్గొనే అవకాశం ఉంది. కాగా లలిత్ మోదీపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ అతడు రాజస్తాన్ జట్టును కొనుగోలు చేయాలంటే కచ్చితంగా కచ్చితంగా ప్రభుత్వం, బీసీసీఐ నుంచి అడ్డంకులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఇక రాజస్తాన్ జట్టును కొనుగోలు చేయాలంటే సుమారు రూ.9,200 కోట్ల నుండి రూ. 11,000 కోట్లు వరకు వెచ్చించాలి. రాయల్స్ జట్టును కొనుగోలు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఇంటర్నెట్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Gautam Gambhir: అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు


