హ్యాట్సాఫ్‌ హీలీ | Australia captain bids farewell to career | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్‌ హీలీ

Mar 4 2026 3:49 AM | Updated on Mar 4 2026 3:49 AM

Australia captain bids farewell to career

కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఆ్రస్టేలియా కెప్టెన్ 

టీమిండియాతో జరిగే టెస్టు కెరీర్‌లో చివరిది 

6 టి20 వరల్డ్‌కప్‌లు నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా ఘనత 

ఆరుసార్లు ఐసీసీ మహిళల టి20 ప్రంపచకప్‌ ముద్దాడిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు... రెండు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచిన ఘనత... మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు... అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన గుర్తింపు.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్‌ కీపర్‌గా చరిత్ర. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌! ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది.  

సుదీర్ఘ కెరీర్‌లో ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఆ్రస్టేలియా మహిళల క్రికెట్‌ జట్టు దిగ్గజ ప్లేయర్‌ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం టీమిండియాతో ఆడిన తన కెరీర్‌ చివరి వన్డేలో భారీ సెంచరీతో కదం తొక్కిన హీలీ... శుక్రవారం నుంచి పెర్త్‌ వేదికగా జరగనున్న ఏకైక టెస్టులో చివరిసారి ఆసీస్‌ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. మహిళల క్రికెట్‌లో దిగ్గజ స్థాయికి చేరిన హీలీ కెరీర్‌ను ఓసారి విశ్లేషిస్తే...   – సాక్షి, క్రీడావిభాగం 

ఇప్పుండంటే అలీసా హీలీ పెద్ద స్టార్‌ అయిఉండవచ్చు కానీ... కెరీర్‌ తొలినాళ్లలో ఆమె మెరుగైన జీవనం కోసం రెస్టారెంట్‌లో పనిచేసింది. 2009–10 మధ్య హీలీ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కేఎఫ్‌సీలో పనిచేస్తూ క్రికెట్‌ ప్రాక్టీస్‌ కొనసాగించింది. అలా ఆమె పడ్డ శ్రమ వృథా పోలేదు. నిలకడగా రాణిస్తున్న హీలీకి 2010లో తొలిసారి జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌తో ఆడిన అరంగేట్ర మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అలీసా... 11 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేసింది. 

అప్పటికీ అదీ మహిళల వన్డేల్లో ఈ దూకుడు ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. లోయర్‌ ఆర్డర్‌లో జట్టుకు మంచి ‘పించ్‌ హిట్టర్‌’ దొరికిందని మేనేజ్‌మెంట్‌ భావించింది. అయితే ఆ జోరు ఎక్కువ కాలం కొనసాగలేదు. వికెట్‌ల వెనక అద్భుతమైన ప్రతిభ కనబర్చిన హీలీ... బ్యాటింగ్‌లో ఆ స్థాయిలో రాణించలేకపోయింది. అయినా... కీపింగ్‌లో ఆమె అసాధారణ గణాంకాలు జట్టులో చోటుకు భరోసానిచ్చాయి. 

మలుపుతిప్పిన 2017 
అప్పటి వరకు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం... అవసరమైనప్పుడు ధాటిగా ఆడటం అలవాటు చేసుకున్న హీలీకి 2017లో అతిపెద్ద ప్రమోషన్‌ దక్కింది. ఆ ఏడాది అక్టోబర్‌లో హీలీకి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం దక్కింది. అప్పటి వరకు అడపాదడపా మెరుపులు మెరిపించిన అలీసా... ఇక దంచికొట్టడం ప్రారంభించింది. ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ... ఇన్నింగ్స్‌ను వాయువేగంతో ప్రారంభించడం అలవాటుగా మార్చుకుంది. 2017కు ముందు... ఆ తర్వాత ఆమె కెరీర్‌ను చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. 

2017 ముందు వరకు 52 మ్యాచ్‌లాడి 15.96 సగటుతో 495 పరుగులే చేసిన ఈ వికెట్‌కీపర్‌... ఆ తర్వాత 74 మ్యాచ్‌ల్లో 46.22 సగటుతో 3282 పరుగులు చేసింది. వన్డేల్లో అలీసా స్ట్రయిక్‌రేట్‌ వందకు పైగా ఉంది అంటే ఆమె ఆటతీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘నిజం చెప్పాలంటే కెరీర్‌ తొలి ఏడెనిమిది సంవత్సరాలు నేనేం అంత బాగా ఆడలేదు. అంతగా అవకాశాలు కూడా రాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశా’ అని ఇటీవల హీలీ వెల్లడించింది.  

8 వరల్డ్‌కప్‌ల విజేత... 
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ్రస్టేలియా హవా సాగుతున్న సమయంలోనే హీలీ కెరీర్‌ కొనసాగింది. దీంతో సహజంగానే ఆమె ఖాతాలో అత్యధిక వరల్డ్‌కప్‌లు చేరాయి. 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఐసీసీ టి20 వరల్డ్‌కప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో హీలీ సభ్యురాలు... మహిళల క్రికెట్‌లో మరే ప్లేయర్‌ ఆరుసార్లు పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఇక 2013, 2022 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులోనూ హీలీ ప్రధానపాత్ర పోషించింది. 

2022 వరల్డ్‌కప్‌ పైనల్లో ఆమె కొట్టిన సెంచరీని అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. ఇంగ్లండ్‌తో జరిగిన తుది పోరులో 138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు చేసి ఆసీస్‌ భారీ విజయానికి అలీసా బాటలు వేసింది. గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది రికార్డు సృష్టించిన హీలీ... టీమిండియాతో జరిగిన సెమీఫైనల్లో విఫలమైంది. ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన ఆసీస్‌ సారథి... ఆసీస్‌లో టీమిండియా పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగనుంది. 

ఆదివారం భారత్‌తో జరిగిన ఆఖరి వన్డేలో హీలీ బ్యాటింగ్‌ చూసిన వారెవరైనా ఆమెకు 35 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. కెరీర్‌ ఆఖరి వన్డేలోనూ అలవోకగా పరుగులు రాబట్టిన హీలీ అనవసరంగా రిటైర్మెంట్‌ ప్రకటించిందనే అనుమానం రాకమానదు. తన కెరీర్‌లో చివరి వన్డేలో కెప్టెన్ గా బరిలోకి దిగిన ఈ ఓపెనర్‌ 98 బంతుల్లోనే 158 పరుగులు చేసింది. ఆమె కెరీర్‌లో ఎన్నో శతకాలు ఉన్నా... దీని ప్రత్యేకతే వేరు. 

ఈ ఇన్నింగ్స్‌లో కేవలం బౌండరీల ద్వారానే అలీసా 120 పరుగులు రాబట్టడం విశేషం. ఇన్ని ఘనతలు సాధించిన హీలీ... శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోనుంది. గతేడాది జరిగిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలంలో ఆమెను ఏ జట్టు తీసుకోకపోయినా... భవిష్యత్తుల్లో అలీసా మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడటం ఖాయమే.  

మిచెల్‌ స్టార్క్‌తో వివాహబంధం...
క్రీడా కుటుంబానికే చెందిన హీలీ మొదటి నుంచే మంచి అథ్లెట్‌. దీంతో కష్టతరమైన క్యాచ్‌లను సైతం ఎంతో ఒడుపుగా అందుకునేది. ఆ్రస్టేలియా దిగ్గజ క్రికెటర్‌ ఇయాన్‌ హీలీ అన్న కుమార్తెగా తనమీద ఉన్న ముద్రను చెరిపేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2015లో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టు పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో హీలీకి పరిచయం ఏర్పడింది. 

స్టార్క్‌ కూడా వికెట్‌ కీపర్‌గానే కెరీర్‌ ప్రారంభించగా... వీరిద్దరి మనసులు కలిసి 2016లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు అండగా నిలుస్తూ... రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడిన తొలి భార్యాభర్తలుగా రికార్డు సృష్టించిన వీరిద్దరూ... పలు సందర్భాల్లో తమ మధ్య అవగాహనను బాహాటంగానే వెల్లడించారు. 2020లో మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో తన భార్య ఆట చూసేందుకు స్టార్క్‌ వన్డే సిరీస్‌ నుంచి సెలవు తీసుకొని స్వదేశానికి చేరడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement