చెత్త ఫీల్డింగ్‌.. టీమిండియా గెలవలేదు: పాక్‌ మాజీ బౌలర్‌ ఓవరాక్షన్‌ | Mohammad Amir Makes New Prediction On India After T20 WC Semifinals Take, Says They Do Not Have Ability To Reach Final | Sakshi
Sakshi News home page

చెత్త ఫీల్డింగ్‌.. టీమిండియా గెలవలేదు: పాక్‌ మాజీ బౌలర్‌ ఓవరాక్షన్‌

Mar 3 2026 9:50 PM | Updated on Mar 4 2026 12:08 PM

Mohammad Amir Makes New Prediction On India After T20 WC Semifinals Take

పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టుకు ఫైనల్‌ చేరే సత్తా లేదంటూ అవాకులు చెవాకులు పేలాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ దశలో సూర్యకుమార్‌ సేన అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.

అజేయంగా సూపర్‌-8
గ్రూప్‌-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి.. సూపర్‌-8లో అడుగుపెట్టింది. అయితే, స్థాయికి తగ్గట్లు రాణించడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్‌ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ సెమీస్‌ చేరతాయని.. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేదంటూ ఓవరాక్షన్‌ చేశాడు.

అయితే, అతడి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా టాప్‌-4లో అడుగుపెట్టింది. దీంతో మహ్మద్‌ ఆమిర్‌ను చివాట్లు పెడుతూ టీమిండియా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

ఆ జట్టు ఫీల్డింగ్‌ చూడండి
అయినప్పటికీ ఆమిర్‌ తీరు మారలేదు. మరోసారి టీమిండియాను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘క్రికెట్‌ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. నిజానికి టీమిండియా అంత గొప్పగా ఏమీ ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్‌ చూడండి.

గత మ్యాచ్‌లో వాళ్లు 3-4 క్యాచ్‌లు వదిలేశారు. జస్‌ప్రీత్‌ బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. హార్దిక్‌ పాండ్యా పెద్ద జట్లపై ఆడలేడని నేను చెప్పాను. అందుకు తగ్గట్లేఅతడు నాలుగు ఓవర్లలో అతడు 40 పరుగులు ఇచ్చుకున్నాడు.

టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌ కాదు
ఇక వెస్టిండీస్‌ బ్యాటర్లు వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లోనూ చితక్కొట్టారు. సెమీ ఫైనల్లో భారత్‌తో ఆడే జట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో రాణించగల సత్తా కలిగి ఉంది. కాబట్టి నా దృష్టిలో టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌ కాదు. వాళ్లు ఫైనల్‌ చేరతారని నేను ఇప్పటికీ నమ్మడం లేదు’’ అని మహ్మద్‌ ఆమిర్‌ అతి చేశాడు. 

ఈ నేపథ్యంలో మరోసారి భారత నెటిజన్లు ఆమిర్‌కు చురకలు అంటిస్తున్నారు. ముందు పాకిస్తాన్‌ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా పాక్‌ సూపర్‌-8 దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. ముంబైలో గురువారం జరిగే ఈ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం వేదిక.   

చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

Advertisement
 
Advertisement
Advertisement