బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ నుంచి అవార్డు అందుకున్న నబీ (PC: PTI)
ఆకిబ్ నబీ.. భారత క్రికెట్‌లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో అతడి అత్యద్భుత ప్రదర్శనలు ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో ఈ పేస్ బౌలర్‌ది కీలక పాత్ర.
స్పందించిన బీసీసీఐ
సీజన్ ఆసాంతం అద్భుత ఆట తీరుతో జట్టును గెలిపించిన ఆకిబ్ నబీ (Auqib Nabi Dar)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని భారత టెస్టు జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు.
అతడిదే కీలక పాత్ర
త్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆకిబ్ ఎంపిక విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదేనని స్పష్టం సైకియా చేశాడు. ‘‘అతడు అద్భుతంగా ఆడాడు. జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర.
క్వార్టర్ ఫైనల్లో ఐదు వికెట్లు తీశాడు. సెమీ ఫైనల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేశాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతడి బౌలింగ్ ఫైనల్ రాతను మార్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిని అతడు ఆకర్షించగలిగాడు.
రంజీ ట్రోఫీకి సంబంధించి ప్రతి మ్యాచ్‌కు మా సెలక్టర్లు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాము. ఫైనల్ సహా కీలక మ్యాచ్‌లన్నీ మా సెలక్టర్లు వీక్షించారు. వాళ్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారనే అనుకుంటున్నా. ఇప్పటికే అతడు లైమ్‌లైట్‌లో ఉన్నాడు. సెలక్టర్లే అతడి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.
అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?
ప్రతిభ ఉన్న వాళ్లకు అన్యాయం జరగకుండా బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుంది. మా సెలక్టర్లు అతడితో పాటు మ్యాచ్‌లో మెరుగ్గా రాణించిన అందరి ఆటను గమనించారు. నబీని వెలుగులోకి తీసుకుచ్చింది ఎవరు?.. అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. జమ్మూ కశ్మీర్ సెలక్టర్లే కదా!..
దేశీ క్రికెట్‌లో రాష్ట్ర జట్టు తరఫున అదరగొట్టిన వారికి బీసీసీఐ సెలక్టర్లు కచ్చితంగా అవకాశం ఇస్తారు’’ అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.
60 వికెట్లు కూల్చాడు
కాగా కర్ణాటకతో ఫైనల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో రాణించి.. కర్ణాటక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా అవతరించింది.
తాజా రంజీ సీజన్‌లో 29 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్ ఏకంగా 60 వికెట్లు కూల్చాడు. ఇందులో ఎనిమిది ఫైవ్ వికెట్లు హాల్స్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆకిబి నబీ అరంగేట్రానికి డిమాండ్లు పెరుగుతున్నాయి.
చదవండి: ప్రపంచకప్ వైఫల్యాల తర్వాత కూడా బాబర్ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు


