చాంపియన్ ఆర్సీబీ (PC: BCCI)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్-2026లో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ మంగళవారం ధ్రువీకరించాడు.
తీవ్ర విషాదం
కాగా 2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి క్రేజీ జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. గతేడాది వరకు టైటిల్ గెలవలేకపోయింది. పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2025లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగిపోగా.. ఫ్రాంఛైజీ తొందరపాటు చర్య తీవ్ర విషాదానికి దారితీసింది.
హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో.. అనుమతి లేకుండానే ఆర్సీబీ విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా.. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆర్సీబీపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలో ఐపీఎల్-2026లో ఆర్సీబీ తమ హోం గ్రౌండ్‌ను మారుస్తుందనే వార్తలు వచ్చాయి. పుణె, ముంబై సహా ఇతర నగరాల్లో తమ మ్యాచ్‌లు ఆడేలా ఆర్సీబీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం అనుమతితో తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే తమ మ్యాచ్‌లు ఆడేందుకు ఆర్సీబీ నిర్ణయించుకుంది.
ఎంతో సంతోషిస్తున్నా
ఈ విషయం గురించి ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘ చర్చలు.. అన్ని అనుమతులు తీసుకున్న అనంతరం మీకు ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఆర్సీబీ ఈసారి ఐదు మ్యాచ్‌లు బెంగళూరులోనే ఆడుతుంది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు.
బెంగళూరులో మ్యాచ్‌లు సజావుగా సాగేలా హామీ ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ప్రకటన విడుదల చేశాడు. కాగా భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే కెప్టెన్‌గా టైటిల్ అందుకోలేకపోయిన కోహ్లి.. గతేడాది రజత్ పాటిదార్ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తమ మిగిలిన రెండు హోం మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.
చదవండి: అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్: గంభీర్


