చిల్లర.. సంకుచిత బుద్ధి: పాక్‌ బోర్డుపై మండిపడ్డ ఆఫ్రిది | Choti Soch: Shahid Afridi Lambasts at PCB narrow minded 50 lakh fine | Sakshi
Sakshi News home page

చిల్లర.. సంకుచిత బుద్ధి: పాక్‌ బోర్డుపై మండిపడ్డ షాహిద్‌ ఆఫ్రిది

Mar 3 2026 5:48 PM | Updated on Mar 3 2026 6:09 PM

Choti Soch: Shahid Afridi Lambasts at PCB narrow minded 50 lakh fine

ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్‌ మరోసారి నిరాశపరిచింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ‌లో‌ పేలవ ప్రదర్శనతో ‘సూపర్‌–8’ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌‌ క్రికెట్‌ బోర్డు (PCB) సీనియర్లపై గుర్రుగా ఉంది.

ఈ నేపథ్యంలో ఆటగాళ్ల పారితోషికాలు, మ్యాచ్‌ ఫీజుల్లో కోత విధించేందుకు పీసీబీ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ‘‘ఈ విషయంలో బోర్డు తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఫీజుల్లో కోత విధించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆటగాళ్ల చెత్త ప్రదర్శనకు ఈ విధంగా మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది’’ అని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

చిల్లర.. సంకుచిత బుద్ధి
ఈ విషయంపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది (Shahid Afridi) ఘాటుగా స్పందించాడు. పీసీబీ విధించే జరిమానా చిల్లరలా ఉందని.. ఇంత సంకుచిత స్వభావం పనికిరాదంటూ బోర్డు తీరును విమర్శించాడు. చెత్తగా ఆడి దేశం పరువు తీసిన వాళ్లకు ఇంతకంటే కఠినమైన శిక్షలు విధించాలంటూ పాక్‌ జట్టు తీరుపై మండిపడ్డాడు.

‘‘ఇది చాలా చిన్న మొత్తం. యాభై లక్షల రూపాయలతో మీరేం చేస్తారు? ఇది అసలు జరిమానాలా అనిపించడమే లేదు. ఇంత సంకుచిత బుద్ధి పనికిరాదు. సరిగ్గా ఆడని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.

రెండేళ్లు పక్కన పెట్టండి
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడమని చెప్పాలి. జట్టులో ‘ఇంకొందరు మహానుభావులు’ ఉన్నారు. వాళ్లనైతే మరో రెండేళ్లపాటు జాతీయ జట్టుకు ఎంపిక చేయకూడదు. వాళ్లకు ఇలాంటి శిక్ష అయితేనే సరిగ్గా ఉంటుంది’’ అని షాహిద్‌ ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

కాగా బాగా ఆడని ఆటగాళ్లకు పాకిస్తాన్‌ కరెన్సీలో రూ. 50 లక్షలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 16 లక్షలు) జరిమానా వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆఫ్రిది అన్నట్లు పాక్‌ ఆటగాళ్లకు ఇదేమీ చిన్నమొత్తం కాదు. వార్షిక కాంట్రాక్టులలో గ్రేడ్‌ సి, డిలలో ఉన్న వాళ్లకు పాక్‌ కరెన్సీలో కేవలం రూ. 10- 17 లక్షల పారితోషికం మాత్రమే ఉంటుంది.

నానాటికీ తీసికట్టుగా
ఇదిలా ఉంటే.. మేజర్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఐసీసీ ఈవెంట్లలో కనీసం సెమీస్‌ కూడా చేరకుండా జట్టు నిష్క్రమించడం వరుసగా ఇది నాలుగోసారి.

ఈ నేపథ్యంలో బోర్డు కఠిన నిర్ణయాలకు వెనుకాడటం లేదు. మరోవైపు.. ప్రపంచకప్‌ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడిన పాకిస్తాన్‌ ఆదివారం రాత్రి కొలంబో నుంచి నేరుగా లాహోర్‌ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లంతా గప్‌చుప్‌గా ఇంటిబాట పట్టారు. 

కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో సల్మాన్‌ ఆఘా కెప్టెన్సీలో పాక్‌.. గ్రూప్‌ దశలో పసికూనలు నెదర్లాండ్స్‌, అమెరికా, నమీబియాలపై గెలిచింది. టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడింది. సూపర్‌-8 దశలో న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కాగా.. తదుపరి ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది. ఆఖరిగా శ్రీలంకపై గెలిచినా నెట్‌ రన్‌రేటు పరంగా వెనుకబడి సెమీస్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. 

చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

Advertisement
 
Advertisement
Advertisement