టీమిండియాకు ఘోర పరాభవం | Australia Women Beat India Women By 10 Wickets In Only Test, Check Out Score Details Inside And Highlights | Sakshi
Sakshi News home page

AUS W VS IND W: టీమిండియాకు ఘోర పరాభవం

Mar 8 2026 1:12 PM | Updated on Mar 8 2026 4:02 PM

Australia women beat india women by 10 wickets in only test

మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ (3 టీ20, 3 వన్డేలు, ఏకైక టెస్ట్‌) కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్‌.. ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో క్వీన్‌ స్వీప్‌ అయ్యింది. ఇప్పుడు టెస్ట్‌ మ్యాచ్‌లో కూడా ఓడి, సిరీస్‌ మొత్తాన్ని కోల్పోయింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (17-5-46-4), లూసీ హ్యామిల్టన్‌ (11-3-31-3), డార్సీ బ్రౌన్‌ (12.4-0-41-2) ధాటికి 62.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో జమీమా రోడ్రిగ్స్‌ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. షఫాలీ వర్మ (35), ఆఖర్లో కశ్వీ గౌతమ్‌ (34 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 323 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బంతితో సత్తా చాటిన సదర్‌ల్యాండ్‌ బ్యాట్‌తోనూ చెలరేగి సూపర్‌ సెంచరీ (129) చేసింది. ఎల్లిస్‌ పెర్రీ (76) అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా ప్లేయర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లలో సయాలీ సత్ఘరే 4, క్రాంతి గౌడ్‌, దీప్తి శర్మ చెరో 2, స్నేహ్‌ రాణా, షఫాలీ వర్మ చెరో వికెట్‌ తీశారు.

125 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ‍ప్రారంభించిన భారత్‌.. ఆసీస్‌ బౌలర్ల ధాటికి మరోసారి దారుణంగా పతనమైంది. హ్యామిల్టన్‌ (8-1-32-3), అలానా కింగ్‌ (10-2-23-2), ఆష్లే గార్డ్‌నర్‌ (4.2-1-8-2), సదర్‌ల్యాండ్‌ (6-2-15-2), డార్సీ బ్రౌన్‌ (14-2-45-1) దెబ్బకు 149 పరుగులకే ఆలౌటైంది. 

ప్రతీక రావల్‌ (63) ఒంటరిపోరాటం చేయగా.. స్టార్‌ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. కెప్టెన్‌ హర్మన్‌(11), జెమీమా (14) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. ఆఖర్లో స్నేహ్‌ రాణా (30) ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించింది.

అనంతరం 25 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం 4.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. జార్జియా వాల్‌ 16, లిచ్‌ఫీల్డ్‌ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్‌ మూడో రోజు తొలి సెషన్‌లోనే ముగిసింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement