T20 WC 2026: ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారీ బూస్టప్‌ | T20 WC 2026 IND Vs NZ, India Has Never Defeated New Zealand In A T20 World Cup, This Gives Major Boost Up To India Before Final | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారీ బూస్టప్‌

Mar 8 2026 12:21 PM | Updated on Mar 8 2026 3:50 PM

T20 WC 2026: India has never defeated New Zealand in a T20 World Cup, This gives major boost up to india before final

టీ20 ప్రపంచకప్‌ 2026 తుది అంకానికి చేరింది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య అంతిమ సమరం జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్‌ వరుసగా తమ రెండో టైటిల్‌ను, ఓవరాల్‌గా మూడో టైటిల్‌ సాధిస్తుందా లేక న్యూజిలాండ్‌ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందా అన్న విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

చర్చలు, అంచనాలు ఎలా ఉన్నా.. టీమిండియాకు మాత్రం ఓ విషయం చాలా బూస్టప్‌ను ఇస్తుంది. అదేంటంటే.. భారత్‌కు టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఇప్పటివరకు ఓటమనేదే లేదు. ఇరు జట్లు ఈ మెగా టోర్నీలో 3 సార్లు ఎదురెదురుపడగా.. మూడు సార్లు టీమిండియానే పైచేయి సాధించింది.

ఓవరాల్‌గా (మొత్తం టీ20ల్లో) చూసినా న్యూజిలాండ్‌పై టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు జరగ్గా.. 16 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిచాయి. మూడు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి.

ఇరు జట్లు గత రెండు సందర్భాల్లో ఎదురెదురుపడినప్పుడు కూడా టీమిండియానే ఆధిక్యత ప్రదర్శించింది. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియానే గెలిచింది.

పై అంశాలతో పాటు మరో అంశం కూడా టీమిండియాకు సానుకూలంగా ఉంది. అదే హోం అడ్వాంటేజ్‌. భారత్‌ సహజంగానే స్వదేశంలో చెలరేగిపోతూ ఉంటుంది. అభిమానుల నుంచి లభించే విపరీతమైన ప్రోత్సాహం టీమిండియాను ఎంతటి ఒత్తిడినైనా అధిగమించేలా చేస్తుంది. 

ఈ విషయం పలు సార్లు మిస్‌ ఫైర్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆసీస్‌ చేతిలో చిత్తైంది. అయితే ఈసారి అలా జరగదని భారత అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement