ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌ | New Zealand Star Lea Tahuhu Announces Retirement From ODIs Ahead Of Men’s T20 World Cup 2026 Final | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌

Mar 8 2026 7:47 AM | Updated on Mar 8 2026 1:09 PM

Lea Tahuhu announces retirement from ODI cricket

టీమిండియాతో జరుగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ మహిళా క్రికెటర్‌ లియా తాహూహు వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. న్యూజిలాండ్ మహిళల క్రికెట్‌లో అత్యంత అనుభవజ్ఞులైన అయిన లియా.. తన 15 ఏళ్ల వన్డే క్రికెట్‌ ప్రయాణానికి ముగింపు పలికింది. 

35 ఏళ్ల తాహూహు, 2011లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసి, 103 వన్డేల్లో 125 వికెట్లు సాధించింది. ఇది న్యూజిలాండ్ మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్ల రికార్డు. లియా కుడి చేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌.

తాహూహు నాలుగు వన్డే ప్రపంచకప్‌లలో (2013, 2017, 2022, 2025) ఆడి 36 వికెట్లు తీసింది. ఇది న్యూజిలాండ్ తరఫున అత్యధికం. అలాగే మొత్తం జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. 2025లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ఆమె చివరి వన్డేగా నిలిచింది.  

రిటైర్మెంట్ సందర్భంగా తాహూహు భావోద్వేగంగా స్పందించారు. “వైట్ ఫెర్న్స్ జెర్సీ ధరించడం ఎప్పుడూ గౌరవం. ఒక్క మ్యాచ్ ఆడటం కూడా గొప్ప అనుభూతే. కానీ వందకు పైగా మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని కలలో కూడా ఊహించలేదని అన్నారు.  

వన్డేలకు వీడ్కోలు పలికినా, అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగుతానని తాహూహు స్పష్టం చేసింది. ఆమె తన చివరి టీ20ని 2025 మార్చిలో ఆడింది. ఈ నెలలో దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో తాహూహు  జట్టులో ఉంటుందని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. 

2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైన తాహూహు, ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరగబోయే టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవడం కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.  

తాహూహు కెరీర్ న్యూజిలాండ్ మహిళల క్రికెట్‌కు ఓ మైలురాయిగా నిలిచింది. ఆమె వేగం, దూకుడు జట్టుకు ప్రత్యేకమైన అంచు ఇచ్చాయి. వన్డేలకు వీడ్కోలు పలికినా, టీ20ల్లో ఆమె అనుభవం జట్టుకు మరింత బలం చేకూర్చనుంది. తాహూహు ఇప్పటివరకు ఆడిన 98 టీ20ల్లో 95 వికెట్లు తీసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement