టీ20 ప్రపంచకప్-2026 తర్వాత పాకిస్తాన్‌కు మరో ఘోర పరభావం ఎదురైంది. ఆదివారం ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 279 పరుగులకు ఆలౌటైంది.
దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ కోల్పోయింది. బంగ్లాపై పాక్ ఓ వన్డే సిరీస్ ఓడిపోవడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో పాక్ జట్టపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ విమర్శల వర్షం కురిపించాడు.
పాక్ క్రికెట్ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతుందని అక్మల్ మండిపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో కూడా పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కనీసం సెమీస్‌కు కూడా చేరకుండా సూపర్-8 స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది.
"ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి దారుణంగా ఉంది. నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లు కూడా పాక్‌తో సిరీస్ ఆడి, మనల్ని ఓడించి టెస్ట్ హోదా పొందాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 350 పరుగుల మార్క్ సులువుగా దాటేలా కన్పించింది. కానీ లిట్టన్ దాస్ నెమ్మదిగా ఆడడంతో 290 పరుగులకే పరిమితమైంది. అయినప్పటికీ మన జట్టు లక్ష్యాన్ని అందుకోలేకపోయింది" అని అక్మల్ ఓ ఛానల్ డిబేట్‌లో పేర్కొన్నాడు.
అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీపై కూడా అతడు పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. మైదానంలో మ్యాచ్‌లు గెలవనప్పుడు.. ఐసీసీ ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తీసుకువస్తారా? అంటూ ఎద్దేవా చేశాడు. కాగా ఆసియాకప్-2025 ట్రోఫీని నఖ్వీ చేతుల మీదగా భారత్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. ఇప్పటికీ ట్రోఫీ ఛాంపియన్ భారత్ వద్దకు చేరలేదు.
చదవండి: చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్


