సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ ఇష్ సోధికి గాయమైంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సోధి బొటనవేలుకు గాయం కాగా.. స్కానింగ్‌లో భాగంగా వేలు విరిగిపోయినట్లు తేలింది.
నాలుగు వారాల విశ్రాంతి
ఫలితంగా ఇష్ సోధికి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో తొలి టీ20కి దూరమైన ఈ రైటార్మ్ స్పిన్నర్.. మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సఫారీలతో రెండో టీ20 సందర్భంగా కివీస్ స్పీడ్‌స్టర్ లాకీ ఫెర్గూసన్ జట్టుతో చేరనున్నాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మౌంట్ మాంగనీ వేదికగా ఆదివారం తొలి టీ20లో సఫారీ జట్టుతో తలపడింది.
91 పరుగులకే ఆలౌట్
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... 14.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది.
నీషమ్ (21 బంతుల్లో 26 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కాన్వే (1), లాథమ్ (7), రాబిన్‌సన్ (6), అరంగేట్ర ఆటగాడు నిక్ కెల్లీ (2), జాకబ్స్ (10), సాంట్నర్ (15) విఫలమయ్యారు.
ఎన్‌కబని మొకొనాకు 3 వికెట్లు
ఇక ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన నలుగురు సఫారీ ప్లేయర్లు విజయంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్‌కబని మొకొనా (Nqobani Mokoena) 3 వికెట్లు పడగొట్టగా... కోట్జీ, బార్ట్‌మన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్ తలా రెండు వికెట్లు తీశారు.
సాంట్నర్ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో సఫారీ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కానర్ ఎస్తెర్హుజెన్ (48 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ద్వారా నలుగురు (కానర్ ఎస్లుర్హుజెన్, డియాన్ ఫారెస్టర్, జోర్డాన్ హెర్మన్, ఎన్‌కబరి మొకొనా) సౌతాఫ్రికా ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇరు జట్ల మధ్య హామిల్టన్‌లో మంగళవారం రెండో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.


