వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు.
మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇటీవల వరుసగా సీనియర్, అండర్–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్’ గుర్తు చేశాడు.
సూర్యకుమార్, గంభీర్ బృందంపై ప్రశంసలు
‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్‌లు, సరైన పరిపాలకులు ఉన్నారు.
జూనియర్ స్థాయిలో, దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ను చూస్తే మన జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్ విశ్లేషించాడు.
అతడి ఆట అసాధారణం
సామ్సన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్ వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్‌లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్‌లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు.
అలాంటి ఆటగాడు భారత్‌కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు.
చదవండి: ‘ఇది ఆరంభం మాత్రమే’


