భారత్ మరెన్నో విజయాలు సాధిస్తుంది
సామ్సన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత జట్టు వచ్చే కొన్నేళ్లలో అన్ని విధాలుగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని బ్యాటర్ సంజు సామ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన జట్టు చూపిస్తున్న ప్రదర్శన అన్ని చోట్లా పునరావృతమవుతుందని అతను అన్నాడు. 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సామ్సన్... భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మన దేశంలో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరిని చూస్తే మన విజయపరంపర కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాబోయే రోజుల్లో మరింత గొప్ప ఆటను మన క్రికెటర్ల నుంచి చూడవచ్చు. ఇటీవల వరల్డ్ కప్ విజయం ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని విజయాలు దక్కడం ఖాయం’ అని ఆదివారం జరిగిన బీసీసీఐ వార్షిక పురస్కారాల సందర్భంగా సామ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరిందని అతను ఉద్వేగంగా చెప్పాడు. ‘ఎవరికైనా పెద్ద కలలు ఉంటాయి. అయితే అవి అంత సులువుగా నిజం కావు. రెండేళ్ల క్రితమే దేశానికి ప్రపంచ కప్‌ను అందించాలని అనుకున్నా.
నేను బలంగా కోరుకున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్‌లో ఇబ్బందులు వచ్చాయి. మానసికంగా సమస్యల్లో ఉన్నా. కానీ జట్టుకు నేను అవసరమై పిలుపు వచ్చినట్లుగా మళ్లీ అవకాశం దక్కింది. టీమ్‌లో ప్రతీ ఒక్కరి నేను బాగా ఆడాలని, జట్టుకు ఉపయోగపడాలని కోరుకున్నారు. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగా. ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగి నిజంగా మారింది’ అని సామ్సన్ వివరించాడు.
సామ్సన్‌కు ఆరు ఓవర్లు చాలు: గంభీర్
సంజు సామ్సన్ ఒక్కసారి చెలరేగడం మొదలు పెడితే ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిపించగలడని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్లను నిలువరించే వ్యూహంలో భాగంగా కాకుండా... విధ్వంసకర రీతిలో ఆడే మరో బ్యాటర్ కావాలనే సామ్సన్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు అతను వెల్లడించాడు. ‘సంజు మెరుపు బ్యాటింగ్ శైలిపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. అతను ఏం చేయగలడో మాకు బాగా తెలుసు.
ఒక్కసారి జోరు మొదలైతే ఆరు ఓవర్లలో మ్యాచ్ గెలిపించగలడు. జిమ్‌లో కలిసి వర్కౌట్ చేస్తున్నప్పుడే జింబాబ్వేతో మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావని చెప్పాను. టాప్–3 ఎడంచేతి బ్యాటర్లు ఉన్నారు కాబట్టి మార్పు కోసం సామ్సన్‌ను మళ్లీ ఆడించామని కొందరు చేస్తున్న విశ్లేషణలు తప్పు. టాపార్డర్‌లో చెలరేగిపోయే మరో బ్యాటర్ ఉంటే బాగుంటుందని భావించే సామ్సన్‌ను తీసుకొచ్చాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు.
ప్రతిభ ఫలితాలను ఇస్తోంది: ద్రవిడ్
వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్ , రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు. మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇటీవల వరుసగా సీనియర్, అండర్–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్’ గుర్తు చేశాడు.

‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్‌లు, సరైన పరిపాలకులు ఉన్నారు. జూనియర్ స్థాయిలో, దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇటీవల టి20 వరల్డ్ కప్‌ను చూస్తే మన జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్ విశ్లేషించాడు. సామ్సన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్ వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్‌లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్‌లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు.
అలాంటి ఆటగాడు భారత్‌కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ లైఫ్‌లైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు.


