Test retirement
-
రోహిత్ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన సీఎం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) హిట్‌మ్యాన్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. సన్మానించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.కాగా రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (Test Cricket Retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. మే 7న ఇందుకు సంబంధించి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. తెలుపు రంగు జెర్సీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు.అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. అతడే వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని పేర్కొంది. అధికారిక నివాసానికి ఆహ్వానించిన సీఎంకాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అతడిని తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. పుష్ఫగుచ్ఛం అందించి.. శాలువాతో రోహిత్‌ను ఫడ్నవిస్ సత్కరించారు. అతడితో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ.. ‘‘భారత క్రికెట్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం ‘వర్ష’కు ఆహ్వానించడం.. ఆయనను కలిసి మాట్లాడటం ఎంతో గొప్పగా అనిపిస్తోంది.టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్కు ప్రకటించిన రోహిత్ శర్మకు శుభాకాంక్షలు. జీవితంలోని తదుపరి అధ్యాయంలోనూ ఆయన ఇలాగే మరింత విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు.దిగ్గజ కెప్టెన్గాకాగా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటికే రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంతో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) కూడా అందించాడు. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మ ప్రదర్శన ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా బాగాలేదు.రోహిత్ సారథ్యంలో టీమిండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది సొంతగడ్డపై విదేశీ జట్టు చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఫలితంగా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (2025) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.కోహ్లి కూడా ఇదే బాటలోఆ తర్వాత ముంబై తరఫున రోహిత్ శర్మ రంజీ బరిలో దిగి కూడా విఫలమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ బీసీసీఐ అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. వీరిద్దరు లేకుండానే జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా కొత్త కెప్టెన్‌గా నియమితుడు కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. వాళ్లిద్దరు ఉంటే బెటర్! -
బాస్.. నువ్వే కెప్టెన్‌గా ఉండు ప్లీజ్!.. నేనైతే ఇదే చెప్పేవాడిని!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) నిర్ణయం పట్ల భారత జట్టు మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ విచారం వ్యక్తం చేశాడు. కోహ్లి తొందరపడ్డాడని.. ఇంగ్లండ్ (IND vs ENG)తో సిరీస్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.తానే గనుక సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్‌ని అయి ఉంటే.. ఈ సిరీస్‌కు కోహ్లినే కెప్టెన్‌ని చేసేవాడినని ఈ మాజీ చీఫ్ సెలక్టర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశాడు.పది వేల పరుగుల మైలురాయికి చేరకుండానే..కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. అయితే, తనకు మరోసారి సారథిగా అవకాశం ఇవ్వాలని కోహ్లి కోరాడని.. అయితే, యాజమాన్యం ఇందుకు నిరాకరించిందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే అతడు వీడ్కోలు పలకడం అనుమానాలను పెంచింది.ఏదేమైనా టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయికి కేవలం 770 పరుగుల దూరంలో కోహ్లి నిలిచిపోయాడు. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన ఈ సారథి.. భారమైన హృదయంతో వైదొలిగాడు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బాస్.. ఈ జట్టుకు నువ్వే కెప్టెన్‌గా ఉండాలిరెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ నేనే గనుక ఇప్పుడు సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవిలో ఉండి ఉంటే.. ‘బాస్.. ఈ జట్టుకు నువ్వే కెప్టెన్‌గా ఉండాలి. భారత టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురా.. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌ను వదిలెయ్’ అని చెప్పేవాడిని.నిజానికి సెలక్టర్లు అతడిని ఒప్పించి ఉండాల్సింది. నేను గనుక అక్కడ ఉంటే.. అతడే కెప్టెన్‌గా ఉండాలని పట్టుబట్టేవాడిని. టీమిండియా గాడిలో పడిన తర్వాత రిటైర్ అవమని చెప్పేవాడిని. అతడికి అదే సరైన వీడ్కోలు అయి ఉండేది’’ అని చిక్కా చెప్పుకొచ్చాడు.ప్రత్యేక ప్రతిభఅదే విధంగా.. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్న శ్రీకాంత్.. ‘‘కోహ్లిలో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంది. ఆట పట్ల అంకిత భావం, నిబద్ధత.. అతడిని ఈ స్థాయికి చేర్చాయి. కఠినంగా శ్రమించడం తనకు అలవాటు.అతడు గొప్ప బ్యాటర్ కాగలడనే నమ్మకం మాకు ఉంది. అందుకే ఆరోజు కోహ్లిని అందరికంటే ముందుగా ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేశాము’’ అని తెలిపాడు. కాగా 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2011-12 నాటి సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డమీద తొలి శతకం సాధించాడు.తన కెరీర్లో మొత్తంగా 123 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల నుంచి కూడా రిటైర్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.చదవండి: గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు! -
నువ్వు దాచుకున్న కన్నీళ్లే గుర్తుండి పోతాయి: అనుష్క భావోద్వేగం
‘‘అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడవచ్చు.. కానీ నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు.. బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. ఈ ఫార్మాట్ పట్ల నీకున్న అమితమైన ప్రేమ గురించి నాకు తెలుసు.నీ నుంచి ఈ ఫార్మాట్ ఎంత లాగేసుకుందో నాకు తెలుసు. ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు మరింత రాటుదేలడంతో పాటు మరింత నిరాడంబరంగా తయారయ్యేవాడివి. నీ ఈ ప్రయాణానికి సాక్షిగా ఉండటం నాకు దక్కిన విశేష గౌరవం. నువ్వు టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నావని చాలాసార్లు ఊహించాను.అయితే, నువ్వు మాత్రం మీ మనసు చెప్పిన మాట విన్నావు. నువ్వు ఇప్పుడు ఇలా వీడ్కోలు పలకడం సరైన నిర్ణయం మై లవ్’’ అంటూ భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ భావోద్వేగానికి లోనైంది.తన భర్త, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రేమపూర్వక నోట్ షేర్ చేసింది అనుష్క. కాగా పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్‌కు కోహ్లి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు అతడు ఈ మేరకు తన నిర్ణయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు.కొనసాగాల్సిందిఈ నేపథ్యంలో భారత, విదేశీ మాజీ క్రికెటర్లు.. 36 ఏళ్ల కోహ్లి మరికొన్నాళ్ల పాటు సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగాల్సిందని అభిప్రాయపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడి రికార్డులను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో అనుష్క పైవిధంగా స్పందించడం గమనార్హం.మూడు ముళ్ల బంధం.. ముచ్చటైన పిల్లలుకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో ఉన్న కోహ్లి.. 2017 డిసెంబరు 11న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2021, జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఆ తర్వాత మూడేళ్లకు అంటే.. ఫిబ్రవరి 15, 2024లో కుమారుడు అకాయ్‌కు విరుష్క జన్మనిచ్చారు.తమ పిల్లలిద్దరిని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుకున్న ఈ స్టార్ జోడీ.. ఇంత వరకు వారి ముఖాలు రివీల్ చేయలేదు. అంతేకాదు.. పిల్లల గోప్యత, భవిష్యత్తు దృష్ట్యా ఎక్కువగా లండన్‌లోనే కాలం గడుపుతున్నారు.శతకాల ధీరుడుఇక టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టులకూ గుడ్‌బై చెప్పిన ఈ రన్‌మెషీన్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. కాగా కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా 82 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో 30, వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 51 శతకాలు బాదిన కోహ్లి.. టీమిండియా తరఫున టీ20లలోనూ సెంచరీ నమోదు చేశాడు.ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న కోహ్లి.. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలపాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి ఐపీఎల్లో ఇప్పటికి 263 మ్యాచ్‌లు ఆడి.. 8 శతకాల సాయంతో 8509 పరుగులు సాధించాడు.చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
కోహ్లి రిటైర్మెంట్.. గంభీర్ రియాక్షన్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సంప్రదాయ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందించిన తీరు వైరల్‌గా మారింది.కాగా ఢిల్లీకి చెందిన కోహ్లి, గంభీర్ల మధ్య గతంలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఎన్నోసార్లు ఈ విషయం బహిర్గతమైంది. మైదానంలోనే ఇద్దరూ గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.అనూహ్యంగా ఇద్దరూ కలిసిపోయారుఅలాంటిది గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాగానే కోహ్లి కెరీర్ ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఇద్దరికీ పొసగదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇద్దరూ కలిసిపోయారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరూ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శనఅంతేకాదు.. జట్టు ప్రయోజనాల కోసం తామిద్దరం కలిసి ప్రయాణిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే వారి మధ్య అనుబంధం పెరిగిందని బీసీసీఐ వర్గాలు కూడా పేర్కొన్నాయి. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.గంభీర్ మార్గదర్శనంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో కోల్పోయింది.ఈ క్రమంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన రోహిత్ శర్మ రిటైర్ అవ్వాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగా ఇంగ్లండ్ టూర్‌కు ముందు బుధవారం రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా కోహ్లి కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు.నిన్ను మిస్సవుతాము చీక్స్నిజానికి కోహ్లి ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి ఆ తర్వాత రిటైర్ అవ్వాలని అనుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, ఇందుకు యాజమాన్యం నిరాకరించిందని.. గంభీర్ యువ నాయకుడిని కోరుకోవడం దీనికి కారణమనేది వాటి సారాంశం.ఈ నేపథ్యంలో కోహ్లి రిటైర్మెంట్ తర్వాత గంభీర్ ఎక్స్ వేదికగా తన స్పందన తెలియజేసిన తీరు వైరల్‌గా మారింది. ‘‘ఆట పట్ల సింహంలాంటి ఆకలి కలిగి ఉన్న వ్యక్తి.. నిన్ను మిస్సవుతాము చీక్స్’’ అంటూ కోమ్లి ఫొటోను పంచుకున్నాడు. కాగా కోహ్లి ముద్దు పేరు చీకూ అన్న విషయం తెలిసిందే.వీడ్కోలు మ్యాచ్, సిరీస్ అవసరం లేదుఇదిలా ఉంటే.. ఇటీవల రోహిత్, కోహ్లిల గురించి గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారి భవిష్యత్తు గురించి తాను ఏమీ చెప్పలేనని, వారిద్దరి ఆట బాగున్నంత కాలం వయసుతో సంబంధం లేదని అభిప్రాయపడ్డాడు.‘జట్టును ఎంపిక చేయడం సెలక్టర్ల బాధ్యత. అది నా చేతుల్లో లేదు. బాగా ఆడుతున్నంత వరకు కోహ్లి, రోహిత్ జట్టులో ఉంటారు. అతని వయసు 40 అయినా 45 అయినా సమస్య ఏముంది. కోచ్, సెలక్టర్ లేదా బీసీసీఐ కూడా ఫలానా ఆటగాడిని నువ్వు తప్పుకోవాలని చెప్పదు. ప్రదర్శన బాగుంటే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కూడా ఉంటారేమో. అయినా వారి ఆట ఎలా ఉందో చాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచమంతా చూసింది కాబట్టి నేను కొత్తగా చెప్పేదేముంది.నా అభిప్రాయం ప్రకారం క్రికెటర్లకు వీడ్కోలు మ్యాచ్ లేదా సిరీస్ అనేది ఉండరాదు. అలాంటి ఒక్క మ్యాచ్‌కంటే ఇన్నేళ్లు జట్టు కోసం ఏం చేశాడో గుర్తు చేసుకోగలిగితే అదే పెద్ద గౌరవం. దేశపు అభిమానులు మిమ్మల్ని, మీ ఆటను ఇన్నేళ్లు ఇష్టపడటానికి మించి ఫేర్వెల్ ఏముంటుంది’ అని గంభీర్ ప్రశ్నించాడు. చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులుA man with lion’s passion! Will miss u cheeks…. pic.twitter.com/uNGW7Y8Ak6— Gautam Gambhir (@GautamGambhir) May 12, 2025 -
దిగ్గజ నాయకుడు.. అసలైన టార్చ్ బేరర్! హ్యాట్సాఫ్.. కానీ ఎందుకిలా?
విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఇకపై టీమిండియా టెస్టు జట్టులో చూడలేము.. సుదీర్ఘ ఫార్మాట్లో అతడి ఆటను, అల్లరిని మిస్సవుతాము.. అవును!.. పద్నాలుగేళ్లుగా తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాలతో అలరించిన కోహ్లి సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడైన 36 ఏళ్ల కోహ్లి.. తన కెరీర్‌ను ముగించాడు.బ్యాటర్‌గా సూపర్ హిట్తన పద్నాలుగేళ్ల కెరీర్లో కోహ్లి 123 టెస్టులు ఆడి 9230 పరుగులు సాధించాడు. సగటు 46.85. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏడు డబుల్ సెంచరీలు కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. సంప్రదాయ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరు 254. ఆసీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర విదేశీ గడ్డలపై సెంచరీలతో అలరించాడు.తన అద్బుత బ్యాటింగ్‌తో టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265), సునిల్ గావస్కర్ (10,122) తర్వాత అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సాధించాడు.టెస్టుల్లో భారత జట్టు దిశను మార్చిన యోధుడు2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2014-15 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. అప్పటికి భారత్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, ఆ తర్వాత కోహ్లి సారథ్యంలో అగ్రస్థానానికి ఎగబాకింది.చిరస్మరణీయ విజయాలు2018-19లో తొలిసారి ఆసీస్ గడ్డపై కోహ్లి సేన టెస్టు సిరీస్ విజయం సాధించింది. అనంతరం 2021-22లో ఇంగ్లండ్‌లో 2-2తో డ్రా చేసుకుంది. సౌతాఫ్రికాలోనూ చిరస్మరణీయ విజయాలు సాధించింది. సొంతగడ్డపై కోహ్లి కెప్టెన్‌గా వరుసగా 11 టెస్టుల్లో టీమిండియాను గెలిపించాడు.సారథిగా మొత్తంగా 68 మ్యాచ్‌లలో నలభై విజయాలు సాధించిన కోహ్లి.. గ్రేమ్ స్మిత్ (53), రిక్కీ పాంటింగ్ (48), స్టీవ్ వా(41) తర్వాత టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌కు టీమిండియాను చేర్చాడు. అయితే, 2022లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టు కెప్టెన్సీకి కోహ్లి వీడ్కోలు పలికాడు.ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగిన కోహ్లి.. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పిన వారం లోపే తానూ అదే బాటలో నడిచాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం స్వయంగా కింగ్ రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ‘‘ఇప్పుడే.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కోహ్లి?’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావుభారత మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే తరహాలో స్పందిస్తున్నారు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావు’’ అని ప్రశ్నించాడు. ఇక భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘టెస్టుల్లో అత్యద్భుతమైన కెరీర్ కలిగి ఉన్నందుకు శుభాకాంక్షలు విరాట్ కోహ్లి.అసలైన టార్చ్‌బేరర్ నువ్వేకెప్టెన్గా నువ్వు కేవలం మ్యాచ్‌లు మాత్రమే గెలవలేదు. ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కూడా మార్చివేశావు. టెస్టుల్లో ఫిట్నెస్, దూకుడుతో పాటు ఒక రకమైన గర్వంతో ఎలా ఆడాలో చూపించావు. కొత్త ప్రమాణాలు రూపొందించావు. భారత టెస్టు క్రికెట్లో అసలైన టార్చ్‌బేరర్ నువ్వే. ధన్యవాదాలు’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు.చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
భారత టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli Retirement) సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు భారమైన హృదయంతో వెల్లడించాడు.బీసీసీఐ ట్వీట్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోహ్లికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ‘‘టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసిపోయింది.. కానీ వారసత్వం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే, టీమిండియాకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. థాంక్యూ విరాట్ కోహ్లి’’ అంటూ కోహ్లి ఫొటోలు పంచుకుంది.దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా?అయితే, బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో వరుస వైఫల్యాలకు కేవలం ఆటగాళ్లనే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ చురకలు అంటిస్తున్నారు.కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో చేజార్చుకుంది.రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడాఈ రెండు సిరీస్‌లలోనూ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా విఫలయ్యాడు. పెర్త్‌లో సెంచరీ బాదినప్పటికీ.. ఆ తర్వాత ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో దాదాపు ఎనిమిది సార్లు ఒకే రీతిలో అవుటయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగి.. అక్కడా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిల ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే, వీళ్లిద్దరు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసేంత వరకు మాత్రం జట్టుతో ఉంటారని అంతా భావించారు. అంతలోనే బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు.కాగా రోహిత్‌ను వైదొలగాల్సిందిగా ముందుగానే సెలక్టర్లు కోరగా.. కోహ్లిని మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కోహ్లి కెప్టెన్సీ చేపట్టాలనే ఉద్దేశంతో ఉండగా.. ఇందుకు బీసీసీఐ నిరాకరించిందని బోర్డు సన్నిహిత వర్గాలు చెప్పడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.బలవంతంగా రిటైర్ అయ్యేలా చేశారనిమరోవైపు.. కోచ్‌గా గౌతం గంభీర్ విఫలమైనా ఎలాంటి చర్యలు చేపట్టని బీసీసీఐ.. రోహిత్, కోహ్లిలను మాత్రం బలవంతంగా రిటైర్ అయ్యేలా చేసిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఇద్దరూ.. ముఖ్యంగా టెస్టుల్లో భారత్‌ను అగ్రపథంలో నిలిపిన కోహ్లికి మైదానంలో ఘనంగా వీడ్కోలు పలకాల్సింది పోయి... ఇలా సోషల్ మీడియాలో సాధారణ ఆటగాళ్లలా రిటైర్మెంట్ ప్రకటించే దుస్థితి కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పది వేల పరుగులు చేస్తానంటూఒకవేళ కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంటే ఈ ఏడాది ఆరంభంలోనే సిడ్నీ టెస్టులోనే వీడ్కోలు ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పటికిప్పుడు వీరిద్దరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని కనిపిస్తోందంటున్నారు. ఈ సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగులు చేస్తానంటూ కోహ్లి గతంలో చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. కాగా కోహ్లి తన టెస్టు కెరీర్లో 9230 పరుగులు చేశాడు. ఈ మైలురాయికి 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి
అనుకున్నదే జరిగింది.. ఊహాగానాలే నిజమయ్యాయి!.. అవును.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ మేరకు.. ‘‘బ్యాగీ బ్లూ ధరించి టెస్టు క్రికెట్లో అడుగుపెట్టి ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి. ఈ ఫార్మాట్లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా ఊహించనే లేదు.ఈ ఫార్మాట్ ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని అనుసరిస్తాను.వైట్ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైనది. సుదీర్ఘంగా క్రీజులో ఉండటం.. అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి.ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది.. కానీ ఇందుకు ఇదే సరైన సమయమని అనిపించింది. ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. అందుకు ఆట కూడా నాకెంతో తిరిగి ఇచ్చింది. నిజానికి నేను చేసిన దాని కంటే.. ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చింది.మనస్ఫూర్తిగా.. కృతజ్ఞతా భావంతో నేను ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నాను. క్రికెట్‌కు, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.టెస్టు కెరీర్ సంతృప్తికరం. నేనెప్పుడు దీని గురించి తలచుకున్నా తప్పకుండా నా మోముపై చిరునవ్వు వెల్లివిరిస్తుంది. #269.. ఇక సెలవు’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రంకాగా 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లి.. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో జమైకా వేదికగా టీమిండియా ఆడిన తొలి టెస్టులో క్యాప్ అందుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.చేదు అనుభవం తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో పది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 54 బంతులు ఎదుర్కొని 15 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, ఈ చేదు అనుభవం తర్వాత కోహ్లి తన ఆటను మెరుగుపరచుకున్నాడు.టీమిండియా మేటి టెస్టు బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. కెప్టెన్‌గానూ సంప్రదాయ క్రికెట్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయం అందించాడు.తన కెరీర్లో మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 31 అర్ధ శతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254.రోహిత్‌తో పాటే..కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పిన ఆరు రోజులకే తానూ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కాగా గత కొంతకాలంగా రోహిత్, కోహ్లి టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి చివరగా పెర్త్‌లో ఆస్ట్రేలియా మీద తన టెస్టు సెంచరీ సాధించాడు. ఇక రోహిత్, కోహ్లి వన్డేలలో మాత్రం కొనసాగనున్నారు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగేందుకు ఈ ‘రన్‌మెషీన్’ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కోహ్లి ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఇప్పుడే వద్దుఅయితే, సెలక్టర్లు మాత్రం కోహ్లిని మరికొన్నాళ్లు కొనసాగాల్సిందిగా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి కోహ్లి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతానని బోర్డుకు చెప్పాడు.అయితే, ఇంగ్లండ్‌తో కీలక సిరీస్ ముందున్న నేపథ్యంలో కోహ్లి తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇంతవరకు అతడు మాత్రం ఈ విజ్ఞప్తిపై తన స్పందన తెలియజేయలేదు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్ గుడ్బైకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌లలో ఆటగాడిగానూ విఫలమైన రోహిత్.. ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పాడు.కోహ్లికి ఘనమైన రికార్డులుఇక ఈ రెండు సిరీస్‌లలో కోహ్లి కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఆసీస్‌తో పెర్త్‌లో శతకం బాదడం మినహా పెద్దగా అతడి బ్యాట్ నుంచి మెరపులేవీ లేవు. ఈ నేపథ్యంలో కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, కోహ్లి టెస్టు కెరీర్ ఎంతో ఘనమైనది. ముఖ్యంగా ఒంటిచేత్తో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై భారత్‌ను గెలిపించిన రికార్డు అతడి సొంతం.కాబట్టి రోహిత్ విషయంలో రిటైర్మెంట్కు సులువుగానే ఓకే చెప్పిన సెలక్టర్లు.. కోహ్లిని మాత్రం కొనసాగాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో మొదటిదైన ఇంగ్లండ్ సిరీస్‌లో అతడిని తప్పక ఆడించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం.కాగా 2011లో టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన కోహ్లి ఇప్పటికి 123 మ్యాచ్‌లు ఆడాడు. సగటున 46.85తో 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 30 టెస్టు శతకాలు, 31 హాఫ్ సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.వన్డేలలో ఇద్దరూ కొనసాగుతారు!మరోవైపు.. రోహిత్ విషయానికొస్తే.. భారత్ తరఫున 67 టెస్టుల్లో 12 శతకాలు, ఒక ద్విశతకం సాయంతో 4301 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి కూడా రోహిత్‌తో పాటే తానూ వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు.ఇప్పుడు రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. కోహ్లి కూడా అతడిని అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ ఇద్దరు ఇటీవల టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వన్డే వరల్డ్‌కప్-2027 వరకు యాభై ఓవర్ల ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్(Test Retirement) ప్రకటించనున్నాడా? ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? అంటే క్రికెట్ వర్గాల్లో అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ విఫలంకాగా సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ ఇటీవల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాలోనూ విఫలమవుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా పెర్త్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో గెలుపొందిన టీమిండియా.. రోహిత్ కెప్టెన్సీలో అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో తీవ్రంగా నిరాశపరిచింది.కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా తాజాగా ముగిసిన మెల్బోర్న్ టెస్టులో రోహిత్(3, 9) తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చినా.. ఆకట్టుకోలేకపోయాడు. పట్టుమని పది పరుగులు చేయకుండానే అవుటయ్యాడు.త్వరగా రిటైర్ పోవాలంటూఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. త్వరగా రిటైర్ పోవాలంటూ హిట్‌మ్యాన్‌కు సూచనలు వస్తున్నాయి. అయితే, ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు రోహిత్ సిద్ధమైనట్లు సమాచారం.టెస్టులకు గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!ఇప్పటికే తన రిటైర్మెంట్ గురించి సెలక్టర్లు, బీసీసీఐ నాయకత్వంతో చర్చించిన రోహిత్ శర్మ.. సిడ్నీ టెస్టులో ఓడితే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడట. ఒకవేళ ఆ మ్యాచ్‌లో గెలిచి.. టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే అవకాశాలు ఉంటే మాత్రం.. ఆ మెగా మ్యాచ్ వరకు సారథిగా కొనసాగాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.ఏదేమైనా సిడ్నీ టెస్టుతో రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ భవితవ్యంపై ఒక అంచనాకు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. గణాంకాలు ఇవీకాగా టెస్టుల్లో గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు ఇవే 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అయితే, ఏ ఆటగాడికైనా గడ్డు దశ అనేది ఉంటుంది. కానీ.. 37 ఏళ్ల రోహిత్ వికెట్ పారేసుకున్న తీరు కారణంగానే అతడి రిటైర్మెంట్పై చర్చలు ఎక్కువయ్యాయి.టీమిండియాకు చేదు అనుభవాలుఇక ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు జరుగనుంది. జనవరి 3-7 వరకు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. పెర్త్‌లో భారత్ 275 పరుగులతో గెలవగా.. అడిలైడ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా కాగా.. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ 184 పరుగుల తేడాతో రోహిత్ సేనను చిత్తు చేసింది. తద్వారా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: 2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే..! -
మెల్‌బోర్న్‌లోనే అగార్కర్?.. రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) త్వరలోనే రిటైర్ కానున్నాడా? బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గనుక భారత జట్టు ఓడిపోతే.. అతడు టెస్టుల నుంచి కూడా తప్పుకుంటాడా?.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ప్రధానంగా నడుస్తున్న చర్చ ఇదే!వరుస వైఫల్యాలుగతంలో ఎన్నడూ లేని విధంగా రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు రావడానికి కారణం అతడి పేలవ ఫామ్. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆటగాడిగా.. కెప్టెన్‌గా రోహిత్ విఫలమయ్యాడు. సొంతగడ్డపై కివీస్‌తో సిరీస్‌లో అతడు చేసిన పరుగులు వరుసగా.. 2, 52, 0, 8, 18, 11.ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో.. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలిసారి ఇంతటి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship డబ్ల్యూటీసీ)2023-25 ఫైనల్ చేరాలంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో కచ్చితంగా నాలుగు టెస్టులు గెలవాల్సిన స్థితిలో నిలిచింది.చావో- రేవోఅయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో టీమిండియాను ముందుకు నడిపించిన జస్ప్రీత్ బుమ్రా భారీ విజయం అందించాడు. ఇక రెండో టెస్టు నుంచి రోహిత్ జట్టుతో చేరినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.రోహిత్ కెప్టెన్సీలో ఆసీస్ చేతిలో పింక్‌బాల్ టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడింది. మూడో టెస్టులోనూ విఫలమై.. వర్షం కారణంగా అదృష్టవశాత్తూ డ్రా చేసుకోగలిగింది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలోనూ రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు ఇన్నింగ్స్ ఆడి 3, 6, 10 పరుగులు చేశాడు.ఓపెనర్‌గా వచ్చినా నో యూజ్!ఇక మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులోనూ రోహిత్ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు. రెండు, మూడు టెస్టుల్లో మిడిలార్డర్లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఈ టెస్టులో మాత్రం తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. కానీ.. ఈసారి కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేశాడు.ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో మరో పేసర్ స్కాట్ బోలాండ్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. నిజానికి అనవసరపు షాట్‌కు యత్నించి అతడు వికెట్ పారేసుకోవడంతో విమర్శలు మరింత పదునెక్కాయి.మెల్‌బోర్న్‌లోనే అగార్కర్?.. రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో గనుక భారత జట్టు ఓడిపోతే.. రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి కఠిన నిర్ణయం తీసుకునే యోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.రోహిత్ మనసులో ఏముందో?అదే విధంగా.. రోహిత్ సైతం ఈసారి తన సారథ్యంలో భారత్ డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైతే.. రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. 37 ఏళ్ల హిట్‌మ్యాన్ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కాగా డబ్ల్యూటీసీ మొట్టమొదటి సీజన్ 2019-21లో కోహ్లి కెప్టెన్సీలో ఫైనల్ చేరిన టీమిండియా.. న్యూజిలాండ్‌కు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక 2021-23 సీజన్లో రోహిత్ సేన ఫైనల్‌కు చేరుకున్నా.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం ఫైనల్‌కు చేరేందుకే ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మపై మునుపెన్నడూ లేని విధంగా ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా కెప్టెన్ హోదాలో టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత రోహిత్ కేవలం టెస్టు, వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం Indian skipper Rohit Sharma is gone for just three runs! #AUSvIND pic.twitter.com/m1fLiqKLO7— cricket.com.au (@cricketcomau) December 27, 2024 -
అశ్విన్ బాటలో రోహిత్ శర్మ?!.. హిట్‌మ్యాన్ సమాధానం ఇదే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడి సారథ్యంలో భారత జట్టు 3-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇప్పటికి మిశ్రమ ఫలితాలే వచ్చాయి.పితృత్వ సెలవుల కారణంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ దూరం కాగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ నేతృత్వంలో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక అడిలైడ్‌లో కంగారూలతో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా.. అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. లేదంటే.. పరిస్థితి ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.ఇక అడిలైడ్, బ్రిస్బేన్‌లో రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా.. ఆరో ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్స్ ఆడి అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 3, 6, 10. దీంతో కెప్టెన్‌గా రోహిత్ తప్పుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. బుమ్రాకు పగ్గాలు అప్పగించాలని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో బ్రిస్బేన్ టెస్టు ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అనుకున్న ఫలితం రాకపోతే రోహిత్ కూడా గుడ్‌బై చెబుతాడనే వదంతులు వ్యాపించాయి.అయితే, రోహిత్ శర్మ మాత్రం వాటిని కొట్టిపడేశాడు. ‘‘నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయానన్నది వాస్తవం. ఈ విషయాన్ని అంగీకరించడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఎల్లవేళలా మెరుగ్గా ఆడేందుకు నన్ను నేను సన్నద్ధం చేసుకుంటాను. అనుకున్న లక్ష్యాలలో దాదాపుగా అన్నిటినీ చేరుకున్నాను.క్రీజులో మరింత ఎక్కువ సేపు నిలబడేందుకు ప్రయత్నిస్తా. ఇక నా శరీరం, నా మనసు సహకరించినంత కాలం.. నేను ముందుకు కొనసాగుతూనే ఉంటా. ఈ ప్రయాణంలో విధి నాకోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసినా వాటిని సంతోషంగా స్వీకరిస్తా’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా చెరో విజయం సాధించి.. మూడో టెస్టును డ్రా చేసుకున్నాయి. ఫలితంగా సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.తదుపరి డిసెంబరు 26- 30 మధ్య బాక్సింగ్ డే టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్‌తో పాటు.. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులోనూ గెలిస్తేనే.. భారత్ ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే వీలుంటుంది. చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు -
Ind vs Ban: షకీబ్ అల్ హసన్ సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. టీమిండియతో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ షకీబ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్టు సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు.ఈ మేరకు షకీబ్ కాన్పూర్‌లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్లో మిర్పూర్లో సౌతాఫ్రికాతో ఆడబోయే మ్యాచ్ నా కెరీర్లో ఆఖరిది. సొంతగడ్డపై నా అభిమానుల మధ్య టెస్టు కెరీర్ ముగించడం సంతోషకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ నాకెంతో చేసింది. పేరు, ప్రతిష్ట అన్నీ ఇచ్చింది. అందుకే నా ఆఖరి టెస్టు స్వదేశంలోనే ఆడాలని నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నాడు.అక్కడకు వెళ్తే బయటకు రాకపోవచ్చుఇక బంగ్లాదేశ్‌లో తన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘బంగ్లాదేశీ పౌరుడిగా.. ఇండియా నుంచి అక్కడికి వెళ్లేందుకు నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాకపోవచ్చు. అయితే, ఒక్కసారి అక్కడకు వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల గురించి ఎప్పటికపుడు నాకు చెబుతూనే ఉన్నారు. నేను కూడా ప్రస్తుతం సందిగ్దావస్థలోనే ఉన్నాను’’ అని షకీబ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఎంపీ పదవి పోయిందికాగా బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా చెలరేగిన అల్లర్లు రాజకీయ సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన అవామీ లీగ్ హెడ్షేక్ హసీనా భారత్‌లో తలదాచుకున్నారు. ఆమె ప్రభుత్వం రద్దు కావడంతో.. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన షకీబ్ పదవి కూడా ఊడిపోయింది.హత్య కేసు నమోదుఆ సమయంలో కెనడా లీగ్‌తో బిజీగా ఉన్న షకీబ్.. నేరుగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే, షకీబ్ బంగ్లాదేశ్‌లో లేని సమయంలో అతడిపై హత్య కేసు నమోదైంది. దేశంలో చెలరేగిన అల్లర్లలో తన కుమారుడు చనిపోవడానికి కారణం ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ సభ్యులు కారణమంటూ ఓ వ్యక్తి షకీబ్పైకూడా కేసు పెట్టాడు. దీంతో అతడిని అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు మాత్రం ఆటగాడిగా షకీబ్ దేశానికి ఎంతో సేవ చేశాడని.. అతడిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జట్టుతో కలిసి షకీబ్ పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆడాడు. బంగ్లా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీబంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన గొప్ప ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్. ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. బంగ్లా తరఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. ఇప్పటి వరకు 70 మ్యాచ్‌లు ఆడి 4600 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. అదే విధంగా.. టెస్టుల్లో 242 వికెట్లు పడగొట్టాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా తన చివరి అంతర్జాతీయ టీ2మ్యాచ్ ఆడిన షకీబ్ అల్ హసన్.. దేశం తరఫున 129 పొట్టి మ్యాచ్‌లలో 2551 రన్స్ చేయడంతో పాటు.. 149 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు 247 వన్డేల్లో 7570 పరుగుల సాధించి.. 317 వికెట్లు కూల్చాడు. చదవండి: IND Vs BAN: ఇలా అయితే కష్టం కోహ్లి!.. 15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్! -
భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
Quinton De Kock Retirement: దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు డికాక్ వీడ్కోలు పలికాడు. సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరగిన తొలి టెస్ట్ అనంతరం డికాక్ ఈ విషయాన్ని ప్రకటించాడు. డికాక్ రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా అధికారంగా ధ్రువీకరించింది. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డి కాక్ 34 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. కాగా మొదటి టెస్టులో ప్రోటీస్ 113 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు. "ఇది నేను అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. సాషా, నేను మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించబోతున్నాము. నా జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించి చాలా ఆలోచించాను. నా కుటుంబమే నాకు సర్వస్వం. మా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను" అని డికాక్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా తరపున 54 టెస్ట్‌లు ఆడిన క్వింటన్ డి కాక్ ఆరు సెంచరీలు, 22 అర్ధ సెంచరీలతో 3,300 పరుగులు చేశాడు. చదవండి: IND Vs SA: స్టన్నింగ్ విక్టరీ.. డ్యాన్స్‌లతో దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు -
టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బంగ్లా టి20 కెప్టెన్
Mahmudullah Retires From Test Cricket.. బంగ్లాదేశ్ టి20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. ఈ మేరకు బంగ్లా క్రికెట్ బోర్డు బుధవారం(నవంబర్ 24న) ఒక ప్రకటనలో అధికారికంగా తెలిపింది. మహ్మదుల్లా మాట్లాడుతూ.. '' టెస్టు క్రికెట్‌కు సరైన సమయంలోనే గుడ్‌బై చెబుతున్నా. నా నిర్ణయాన్ని జింబాబ్వే పర్యటన అనంతరమే ప్రకటించా. కానీ ఇంతకాలం ఆ విషయం దృవీకరించకుండా నేను టెస్టులు ఆడాలని భావించిన బీసీబీకి కృతజ్ఞతలు.12 ఏళ్ల టెస్టు కెరీర్లో బంగ్లాదేశ్‌కు ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నేను టెస్టుల నుంచి మాత్రమే రిటైరవుతున్నా. టి20లు, వన్డేల్లో ఇంకా కొంతకాలం కొనసాగుతా. వైట్‌బాల్ క్రికెట్లో దేశానికి మరింతకాలం సేవ చేయాలని భావిస్తున్నా'' అంటూ ముగించాడు. ఇక 2009లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టులో అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 50 టెస్టుల్లో 2914 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 43 వికెట్లు తీశాడు. చదవండి: T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా వాస్తవానికి ఈ ఏడాది జింబాబ్వే పర్యటనలోనే మహ్మదుల్లా టెస్టు రిటైర్మెంట్పై స్పందించాడు. ఇదే విషయాన్ని అప్పట్లో తన సహచరులతో పాటు బీసీబీకి ముందే వివరించాడు. టి20, వన్డేలపై దృష్టి పెట్టేందుకు టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఆ తర్వాత జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 150 పరుగులు నాటౌట్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడి బంగ్లాదేశ్‌కు 220 పరుగుల విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో బంగ్లా బోర్డు మహ్మదుల్లా రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా దృవీకరించలేదు. తాజాగా మహ్మదుల్లా టెస్టు రిటైర్మెంట్పై నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేయడంతో బీసీబీ అంగీకరించింది. చదవండి: Mankading: 'మన్కడింగ్' అనడం ఆపేయండి.. గంగూలీకి మాజీ క్రికెటర్ కుమారుడి లేఖ -
రిటైరయినందుకు బాధపడను: ధోనీ
వెస్టిండీస్‌తో నేటి(గురువారం) నుంచి ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని భారత పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. కరీబియన్ గడ్డపై మందకొడి పిచ్‌ల దృష్ట్యా జట్టులో స్పిన్నర్లు చాలా కీలకం కానున్నారని తెలిపాడు. భారత జట్టులో పేసర్లు విరివిగా అందుబాటులో ఉండడంపై ధోని అనందం వ్యక్తం చేశాడు. టెస్టుల నుంచి తాను వైదొలగినందుకు(రిటైర్మెంట్) చింతించడం లేదని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు తన సేవలు కొనసాగుతున్నాయని చెప్పాడు. గతంలో టెస్టులు, వన్డేలు, టీ20లు అంటూ అన్ని ఫార్మాట్ల మ్యాచ్ లతో బిజీబిజీగా ఉండేవాడిని. అయితే టెస్టులకు గుడ్ బై చెప్పినందున ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో కుటుంబంతో గడపడంతో పాటు తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నట్లు ఎంఎస్ ధోని తెలిపాడు. -
టెస్టులకు దిల్షాన్ గుడ్‌బై
కొలంబో: శ్రీలంక స్టార్ ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ‘జింబాబ్వేతో టెస్టు సిరీస్ తర్వాత టెస్టులకు వీడ్కోలు చెబుదామనుకున్నాను. కానీ ఆ సిరీస్ వాయిదా పడింది. నా స్థానంలో మరో యువ ఆటగాడిని తయారు చేయడానికి బోర్డుకు అవకాశం ఉండాలనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాను’ అని దిల్షాన్ ఒక ప్రకటనలో తెలిపాడు. వన్డేల్లో మాత్రం 2015 ప్రపంచకప్ వరకు కొనసాగాలని భావిస్తున్నాడు. 14 ఏళ్ల టెస్టు కెరీర్లో 87 మ్యాచ్‌ల్లో 5492 పరుగులు చేసిన దిల్షాన్... 39 వికెట్లు కూడా తీశాడు. 16 సెంచరీలు చేశాడు.