
PC: BCCI
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండుల్కర్ (100) తర్వాత అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లి (82) కొనసాగుతున్నాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ రికార్డుల రారాజు.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు (Test Retirement) పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు.. టీమిండియా తరఫున వన్డేల్లోనూ కొనసాగుతున్నాడు కోహ్లి.
అంతా కోహ్లి మయం..
ఈ క్రమంలో ఇటీవల వ్యక్తిగత పని పూర్తి చేసుకొని తిరిగొస్తుండగా మైదానంలో ఒక అభిమాని ఎందుకు టెస్టులకు రిటైర్మెంట్ తీసుకున్నావని కోహ్లిని అడిగాడు. ఇందుకు స్పందిస్తూ ‘ఆర్సీబీని గెలిపిస్తాం కదా’ అని కోహ్లి జవాబిచ్చాడు.
ఈ సీజన్‌లో బెంగళూరుకు టైటిల్ అందించాలని అతను ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్థమవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనూ అది కనిపిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికి 11 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 7 అర్ధసెంచరీలతో ఇప్పటికే 505 పరుగులు సాధించిన కోహ్లి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మొదటిసారి కోహ్లి మైదానంలోకి దిగుతుండటంతో అందరి దృష్టీ అతనిపైనే ఉంది. గురువారం అతడి ప్రాక్టీస్ సెషన్ సమయంలో కూడా చిన్నస్వామి స్టేడియంను ఫ్యాన్స్ హోరెత్తించారు.
వందల సంఖ్యలో హాజరైన అభిమానులు కోహ్లి ప్రతీ కదలికపై సందడి చేశారు. దాదాపు గంట పాటు అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. కోహ్లి ఉన్నంత సేపూ అతని పేరు తప్ప అక్కడ మరేమీ వినిపించలేదు.
భారీ స్థాయిలో స్పందన
కోల్‌కతాతో శనివారం జరిగే మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చు. కోహ్లి టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత కొందరు వీరాభిమానులు సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు.
‘కింగ్’పై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ, టెస్టు క్రికెటర్‌గా కోహ్లిని గుర్తు చేస్తూ ఐపీఎల్ మ్యాచ్‌కు కూడా తెలుపు రంగు టెస్టు జెర్సీలతో స్టేడియానికి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు భారీ స్థాయిలో స్పందన లభించింది.
ఎలాంటి ప్రభావం చూపదు
ఈ రకంగా చూస్తే శనివారం ఆర్సీబీ రెగ్యులర్ జెర్సీ ‘రెడ్ అండ్ గోల్డ్’లో కాకుండా ‘విరాట్ 18’ వైట్ జెర్సీలే మైదానాన్ని ముంచెత్తవచ్చు. అయితే విరాట్‌పై మైదానం బయటి స్పందనలు, వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించవని... ఏకాగ్రత చెదరకుండా తనదైన శైలిలో ఎప్పటిలాగే అతను బాగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాడని ఆర్సీబీ డైరెక్టర్ మో బొబాట్ వ్యాఖ్యానించారు.
కాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ తాజా ఎడిషన్ శనివారం (మే 17) నుంచి పునః ప్రారంభం కానుంది. ఆర్సీబీ- కోల్‌కతా జట్ల మధ్య జరిగే శనివారం నాటి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.
ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ ఈసారి అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బెంగళూరు జట్టు.. ఎనిమిదింట గెలిచి పదహారు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతాపై తాజా మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!