
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాల కడలిని దాటి శిఖరాగ్రానికి చేరుకున్న కుమారుడిని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం రచించుకున్న రోహిత్ శర్మను అతని సొంత సంఘం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సముచిత రీతిలో గౌరవించిన విషయం తెలిసిందే.
ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఒక ప్రేక్షకుల గ్యాలరీకి ‘రోహిత్ శర్మ స్టాండ్’ అని పేరు పెట్టింది. ఈ స్టాండ్ ఆవిష్కరణ కార్యక్రమంశుక్రవారం జరిగింది. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్, భార్య రితిక (Ritika), మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి హాజరై ‘రోహిత్ శర్మ స్టాండ్’ను ప్రారంభించారు.

రోహిత్ భావోద్వేగం
ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నేడు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదో ప్రత్యేక అనుభూతి. మ్యాచ్‌లలో సాధించే ఎన్నో మైలురాళ్లకంటే విశేషమైంది.
వాంఖడేలాంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఎంతో మంది దిగ్గజాల సరసన నా పేరు కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేదు. ఈ స్టేడియంలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. వచ్చే బుధవారం ఇక్కడ నా స్టాండ్ ముందు ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాను. అది చాలా గొప్ప అనుభవం అవుతుంది.
ఇక భారత్ తరఫున మ్యాచ్ ఆడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. నా కుటుంబ సభ్యులందరి ముందు ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ ఎంతో కృతజ్ఞుడను’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
మరోవైపు.. కుమారుడి పేరిట స్టాండ్ ఆవిష్కరణ కాగానే పూర్ణిమా- గురునాథ్ ఆనందభాష్పాలు రాల్చగా.. రితిక కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుకగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరిట, సీనియర్ అడ్మినిస్ట్రేటర్, ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరిట కూడా స్టాండ్‌లను ఆవిష్కరించిన ఎంసీఏ... ఇటీవలే కన్నుమూసిన మాజీ అధ్యక్షుడు అమోల్ కాలే పేరిట ప్రత్యేక లాంజ్‌ను కూడా ప్రారంభించింది.

‘నేనైతే సిడ్నీలో రోహిత్‌ను ఆడించే వాడిని’
మరోవైపు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌తో చివరి టెస్టుకు ముందు తాను ఫామ్‌లో లేనంటూ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకొన్నాడు. సిడ్నీలో జరిగిన ఈ టెస్టుకు దూరమైన అతను మళ్లీ టెస్టు ఆడకుండానే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాను జట్టు కోచ్‌గా ఉండి ఉంటే రోహిత్‌ను తప్పనిసరిగా ఆ టెస్టులో ఆడించే వాడినని మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
‘సిరీస్ ముగిసిపోలేదు కాబట్టి కచి్చతంగా అతడిని ఆడించే వాడిని. సిరీస్‌లో 1–2తో వెనుకబడి ఉన్న సమయంలో జట్టును వదలవద్దని చెప్పేవాడిని. ఆ టెస్టులో తేడా ఒక 30–40 పరుగులు మాత్రమే. ఫామ్ ఎలా ఉన్న అతనో మ్యాచ్ విన్నర్. పిచ్‌పై పరిస్థితిని అర్థం చేసుకొని ఓపెనర్‌గా ఒక 35–40 పరుగులు చేసి ఉంటే చాలు మ్యాచ్ ఫలితం మారిపోయేదేమో. సిరీస్ కూడా సమంగా ముగిసేది. అక్కడ రోహిత్ ఆడకపోవడం నన్ను చాలా కాలం వెంటాడింది’ అని రవిశాస్త్రి తన మనసులో మాటను పంచుకున్నాడు.
#WATCH | Mumbai | Rohit Sharma stands unveiled at Wankhede stadium. Indian ODI men's cricket team captain Rohit Sharma and his family, Maharashtra CM Devendra Fadnavis, NCP-SCP chief Sharad Pawar, and others, are also present.
The Mumbai Cricket Association (MCA) is formally… pic.twitter.com/K39kSfRkCY— ANI (@ANI) May 16, 2025