
ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్‌పై ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు.. పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ ఎలా ఆడుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మ్యాచ్‌కు బీసీసీఐ ఎలా అనుమతి ఇచ్చింది అంటూ నిలదీశారు.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జాతీయ మీడియా పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ..‘నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవని.. చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చాలా సార్లు చెప్పారు. ఇలా మాట్లాడి.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్‌తో ఎలా క్రికెట్ ఆడుతారు. దుబాయ్‌లో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఈ మ్యాచ్‌ను చూడను. పాక్‌తో భారత్.. వాణిజ్య సంబంధాలను తెంచుకున్నారు, గగనతలాన్ని మూసివేశారు. కానీ, మీరు క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రశ్నించారు. పాక్‌తో ఆడటానికి కేంద్రం ఎలా అనుమతి ఇస్తుంది. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక వ్యామోహం. క్రికెట్ ప్రతీ దాన్ని స్తంభింపజేస్తుంది అని అన్నారు.
ఇదే సమయంలో పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రజలు వారి కుటుంబ సభ్యుల ముందే చనిపోయారు. ఈ దాడి నన్ను తీవ్రంగా బాధించింది. ఈ ఘటన చాలా దారుణం. భార్యాపిల్లల ముందే తమ వారిని ఎవరైనా హత్య చేయడం బాధాకరం. ఇంత దారుణం జరిగినప్పుడు పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటంలో అర్థం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం మ్యాచ్‌కు అనుమతి ఇస్తుంది?. పాక్, భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే, హిందూ ఉగ్రవాదం అనేదే లేదు అని హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ.. మహాత్మా గాంధీని ఎవరు చంపారు? ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు చంపారు?. మహాత్మా గాంధీని ఎవరు చంపారో అమిత్ షా మర్చిపోయి ఉండవచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో భద్రతా లోపానికి జవాబుదారీతనం వహించాలి. భారీ సైనిక ఉనికి ఉన్నప్పటికీ ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారు?. పౌరులను ఎలా హత్య చేయగలిగారు?. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటికీ ఉగ్రవాద నిరోధక చర్యలు విఫలమయ్యాయి’ అని విమర్శించారు.