ఊపిరినిచ్చే ‘విటమిన్‌–సీ’ | Vitamin C Protective Effect Against Air Pollution | Sakshi
Sakshi News home page

ఊపిరినిచ్చే ‘విటమిన్‌–సీ’

Jan 7 2026 6:18 AM | Updated on Jan 7 2026 6:18 AM

Vitamin C Protective Effect Against Air Pollution

వాయు కాలుష్య సంబంధ వ్యాధుల నుంచి రక్షణ 

యూటీఎస్, వూల్‌కాక్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం

విటమిన్‌–సీ.. రోగనిరోధక శక్తిని పెంచడంలో దీనిది ప్రత్యేక పాత్ర. విటమిన్‌–సీ ప్రయోజనాల చిట్టా చాలా పెద్దదే. అయితే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వాయుకాలుష్య సంబంధ ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి రక్షించడంలో విటమిన్‌–సీ దోహదం చేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల వచి్చన పొగ, దుమ్ముతో కూడిన తుపానుల వల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడంలో విటమిన్‌–సీ ప్రయోజనకారి అని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ సిడ్నీ (యూటీఎస్‌), వూల్‌కాక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఇటీవల ఆ్రస్టేలియాలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పీఎం–2.5 కాలుష్యానికి గురైన ఎలుకలు, ప్రయోగశాలలో పెరిగిన మానవ కణజాలాలపై వరుస ప్రయోగాలు చేయడం ద్వారా విటమిన్‌–సీ ప్రభావాలను పరిశోధకులు పరీక్షించారు.

మైటోకాండ్రియాకు రక్షణ
పీఎం2.5 ప్రేరిత కణ అసమతుల్యత, వాపును విటమిన్‌–సీ సమర్థవంతంగా నిరోధిస్తుందని పరిశోధన కనుగొంది. కణాలలో హానికరమైన పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుందని.. మైటోకాండ్రియా దెబ్బతినకుండా కాపాడుతుందని తేలింది. వాయు కాలుష్యం వల్ల అధిక ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులకు విటమిన్‌–సీ సహాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసే ప్రపంచ సమస్యకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే సిఫార్సు చేసిన గరిష్ట మోతాదు వరకే విటమిన్‌–సీని తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కానీ మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమని.. వైద్యుల సూచన మేరకే స్వీకరించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో వాయు కాలుష్యం వల్ల కలిగే నష్టాలన్నింటినీ తొలగించగల అద్భుత పదార్ధం ఇది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ప్రాణాలను హరిస్తోంది..
గాలి నాణ్యతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన పీఎం–2.5 స్థాయి ఏడాదిలో ఒక్కో క్యూబిక్‌ మీటర్‌కు 40 ్పమైక్రోగ్రామ్స్‌ వరకు ఆమోదయోగ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది 5 ్పమైక్రోగ్రామ్స్‌ మించకూడదు. పారి్టక్యులేట్‌ మ్యాటర్‌ (పీఎం)–2.5 అంటే 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసంగల కణ పదార్థం. ఇది మానవ జుట్టు కంటే దాదాపు 30 రెట్లు చిన్నగా ఉంటుంది. వాహనాల నుంచి వెలువడే పొగ, ధూళి గాలిలోకి కలిసి ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ కణాలు చాలా చిన్నవి కాబట్టి ఊపిరితిత్తులు, రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, అకాల మరణాలను గణనీయంగా పెంచుతున్నాయి. వాయు కాలుష్యం ధూమపానం కంటే ప్రమాదకారి. స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ నివేదిక–2025 ప్రకారం ఎయిర్‌ పొల్యూషన్‌తో ప్రపంచవ్యాప్తంగా 2023లో 79 లక్షల మంది మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా విటమిన్–సీ అమ్మకాల విలువ 2024లో రూ.19,800 కోట్లు
2030-34 మధ్య విక్రయాల విలువ 
రెండింతలు దాటుతుందని మార్కెట్ అంచనా

ప్రయోజనాలు ఎన్నో..
చర్మ ఆరోగ్యానికి కావాల్సిన కొల్లాజెన్‌ ఉత్పత్తికి, కణాలు దెబ్బతినకుండా రక్షించడానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా విటమిన్‌–సీ పనిచేస్తుంది. 
దీర్ఘకాలిక వ్యాధులు, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
ఎముకలు, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. 
గాయాలను నయం చేయడంతోపాటు మహిళల్లో వంధ్యత్వాన్ని ఎదుర్కోవడంలో తోడ్పడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement