టీమిండియా విధ్వంసకర బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌కు ముందు తన ఉద్దేశాలను మరోసారి స్పష్టం చేశాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని సిక్సర్‌గా మలచడమే లక్ష్యంగా పెట్టుకున్న అభిషేక్.. తన తాజా ప్రదర్శనతో క్రికెట్ సర్కిల్స్‌లో భయోత్పాతం సృష్టించాడు.
ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్‌గా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న ఈ సిక్సర్ల వీరుడు.. ఇవాళ (డిసెంబర్ 28) జైపూర్‌లోని అనంతం గ్రౌండ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఏకంగా 45 సిక్సర్లు బాది, అక్కడున్న వారిలో (ట్రిబ్యూన్ రిపోర్టర్ల కథనం) భయాందోళనలు పుట్టించాడు. ఈ విషయాన్ని ట్రిబ్యూన్ మీడియాకు చెందిన రిపోర్టర్లు నివేదించారు.
వారి నివేదిక ప్రకారం.. పంజాబ్ రేపు జరుగబోయే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో (జైపూర్‌లోని అనంతం క్రికెట్ గ్రౌండ్) ఉత్తరాఖండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ శర్మ శివాలెత్తిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని భారీ షాట్ ఆడి, ఏకంగా 45 సిక్సర్లు బాదాడు. ఇది చూసి రిపోర్టర్లు సహా అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు.
ఈ స్థాయి విధ్వంసమేంటంటూ నోరెళ్లబెట్టారు. ప్రతి బంతిని బాదడమే ధ్యేయంగా పెట్టుకొన్న అభిషేక్.. స్పిన్నర్ల బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. దాదాపు ప్రతి బంతిని కవర్స్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. అభిషేక్ వీరంగం చూసి పంజాబ్ కోచ్ సందీప్ శర్మ అవాక్కైపోయాడు. ట్రిబ్యూన్ రిపోర్టర్లు నివేదించిన ఈ కథనం చూసి ప్రపంచ బౌలర్లంతా భయాందోళనలకు గురవుతుంటారు.
వాస్తవానికి అభిషేక్ సిక్సర్ల వీరంగం గతేడాది ఆరంభం నుంచే మొదలైంది. ఈ ఏడాది చివర్లో అది తారాస్థాయికి చేరినట్లుంది. 2024 ఐపీఎల్‌తో మెరుపులు ప్రారంభించిన అభిషేక్ అప్పటినుంచి తానెదుర్కొన్న ప్రతి బౌలర్‌ను షేక్ చేస్తూనే వస్తున్నాడు.
ఈ ఏడాది అతని సిక్సర్ల ప్రదర్శన శృతి మించింది. ఇప్పటివరకు ఆడిన 41 టీ20ల్లో ఏకంగా 108 సిక్సర్లు బాది, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కరణ్‌బీర్ సింగ్ (ఆస్ట్రియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్) మాత్రమే అభిషేక్ కంటే ముందున్నారు.


