టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 56), కెప్టెన్ మిచెల్ మార్ష్ (54) మొదటి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఒక దశలో 104/0 తో ఉన్న ఆస్ట్రేలియాను లంక స్పిన్నర్లు దూషన్ హేమంత, దునిత్ వెల్లలాగే కట్టడి చేశారు. కేవలం 77 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ తన 10 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో హేమంత మూడు వికెట్లు పడగొట్టగా.. చమీరా, కమిందు మెండిస్, వెల్లలాగే తలా వికెట్ సాధించారు.
నిస్సాంక సూపర్ సెంచరీ..
అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే చేధించింది. లంక ఓపెనర్ పాథుమ్ నిస్సాంక అజేయ సెంచరీతో సత్తాచాటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన నిస్సాంక.. చివరి వరకు క్రీజులో నిలబడి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.
నిస్సాంక 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. అతడితో వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (51), పవన్ రత్నాయకే(28) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిష్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆసీస్ ఇంటికే!
ఈ విజయంతో గ్రూపు-బి నుంచి శ్రీలంక సూపర్-8కు అర్హత సాధించింది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన ఆసీస్ మాత్రం తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ గ్రూపు పాయింట్ల పట్టికలో జింబాబ్వే(4 పాయింట్లు) రెండో స్దానంలో ఉంది. ఆసీస్ సూపర్-8కు చేరాలంటే జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లలో ఐర్లాండ్, శ్రీలంకపై ఓడిపోవాలి. అదేవిధంగా ఒమన్‌పై ఆసీస్ భారీ విజయం సాధించాలి.


