ఏ విచారణకైనా రెడీ | Bhatti Vikramarka Comments in Telangana Legislative Assembly | Sakshi
Sakshi News home page

ఏ విచారణకైనా రెడీ

Jan 7 2026 2:23 AM | Updated on Jan 7 2026 5:01 AM

Bhatti Vikramarka Comments in Telangana Legislative Assembly

పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై విచారణకు సర్కారు సిద్ధం

2014 నుంచి హిల్ట్‌పీ వరకు.. ప్రతిపక్షాలు లేఖ రాస్తే చాలు 

ఆ మరుక్షణమే ఏ విచారణ సంస్థతో కావాలంటే ఆ సంస్థతో విచారణ 

శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లీజు భూములను ఫ్రీహోల్డ్‌ చేసింది.. పారిశ్రామిక భూములను తమకు కావాల్సిన వాళ్లకు అప్పగించింది 

మేము తెచ్చిన హిల్ట్‌ పాలసీలో దోపిడీకి ఆస్కారం లేదు 

పారిశ్రామికవాడల నుంచి కాలుష్య పరిశ్రమలను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలిస్తాం 

కాలుష్య రహిత నగరాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడమే లక్ష్యమన్న డిప్యూటీ సీఎం  

శాసనసభ నిరవధిక వాయిదా

హైదరాబాద్‌లో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. నిర్దేశిత ప్రమాణాలను మించిపోయింది. ఇటీవల ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 263 నమోదైంది. వాహనాలతో 27% వాయుకాలుష్యం ఏర్పడుతుంటే, పరిశ్రమలతో 51% ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలించడానికి 2012 నుంచే ప్రయ త్నాలు జరుగుతున్నాయి. మేం ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు పంపిస్తాం. వాటికి ప్రత్యామ్నాయ పారిశ్రామికవాడలను సిద్ధంగా ఉంచాం..    
– డిప్యూటీ సీఎం భట్టి

సాక్షి, హైదరాబాద్‌:  2014 నుంచి, ఇటీవల తమ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్‌పీ తో పాటు ఇప్పటివరకు జరిగిన పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై ఏ విచారణను ఆదేశించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. ఆ మేరకు లేఖ రాసిన మరుక్షణం ఏ విచారణ సంస్థతో కావాలంటే ఆ సంస్థతో విచారణ చేయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మంగళవారం శాసనసభలో హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల మార్పిడి (హిల్ట్‌) విధానం (పీ), తెలంగాణ రైజింగ్‌–2047పై లఘు చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలకు భట్టి జవాబిచ్చారు.  

హిల్ట్‌ పీతో రూ.10,776 కోట్ల ఆదాయం: ‘ప్రతిపక్షం కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని పట్టించుకోకుండా తమ రాజకీయం కోసం రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లీజు భూములను ఫ్రీహోల్డ్‌ చేసింది. తమకు కావాల్సిన వాళ్లకు పారిశ్రామిక భూములను వినియోగ మార్పిడి చేసింది. సిరీస్, గల్ఫ్‌ ఆయిల్‌ పరిశ్రమలకు భూ వినియోగ మార్పిడి చేసిన అంశాన్ని హిల్ట్‌ పాలసీతో పోల్చినప్పుడు రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.4,076 కోట్ల నష్టం వాటిల్లింది. హిల్ట్‌ పీ కింద కాంగ్రెస్‌ ప్రభుత్వం.. 80 అడుగుల లోపు రహదారి ఉన్న భూములకు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ (ఎస్‌ఆర్‌వో) ధరలో 30 శాతం, 80 అడుగుల కంటే ఎక్కువ వెడల్పుతో రహదారి ఉన్నచోట ఎస్‌ఆర్‌వో ధరలో 50 శాతం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. కేవలం భూ వినియోగ మార్పిడి చేస్తున్నందుకు ఈ ఫీజులు వసూలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న భూ వినియోగ మార్పిడి ధరల ప్రకారం అయితే కేవలం రూ.574 కోట్ల ఆదాయం మాత్రమే రాష్ట్రానికి లభిస్తుంది. అదే హిల్ట్‌ పీ కింద దాదాపు 4,780 ఎకరాల భూములకు భూ వినియోగ మార్పిడికి అవకాశం కల్పించడం ద్వారా దాదాపు రూ.10,776 కోట్ల ఆదాయం లభిస్తుంది..’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. 

హిల్ట్‌ పీ అత్యుత్తమం, పారదర్శకమైనది.. 
‘హిల్ట్‌ పాలసీ రాగానే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఓ నాయకుడు ప్రెస్‌మీట్‌ పెట్టి రాష్ట్రంలోని భూములన్నింటినీ అమ్మేస్తూ రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు తెరలేపారని   ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించి, బట్ట కాల్చి మీద వేసి తుడుచుకోమంటున్నారు. వారు రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కంటే.. సొంత ప్రయోజనాల కోసం ఎక్కువగా పాకులాడుతున్నారు. హిల్ట్‌ పీ వల్ల రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంటే.. గతంలో వారు చేసిన నిర్ణయాలతో భారీ నష్టం జరిగింది. గత ప్రభుత్వం అనుసరించి విధానాలతో పోలిస్తే హిల్ట్‌ పీ అత్యుత్తమమైనది. పారదర్శకమైనది. ఆదాయం సమకూరుతుంది. 

వారు ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ భూములు లీజులో ఉంటే...వాటిని వేలానికి పెట్టకుండా ఇష్టానుసారం ఇచ్చేశారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పారిశ్రామికవేత్తలకు అప్పగించారు. వనరుల సమీకరణకు 2019లో అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో వేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీకి సంబంధం లేకుండా కేటీఆర్‌ పరిశ్రమల మంత్రిగా జీవో ఇచ్చి పారిశ్రామిక భూములను ఐటీ పరిశ్రమలకు మార్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. వారికి అనుకూలమైన వారికి భూ మార్పిడి చేశారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. మేము తెచ్చిన పాలసీలో దోపిడీకి ఆస్కారం లేదు..’ అని భట్టి చెప్పారు.  

రాష్ట్రానికి ఉత్పాదక షాక్‌ అవసరం 
‘ప్రస్తుతం రాష్ట్రం 200 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. వృద్ధి ఇలానే కొనసాగితే 2047 నాటికి 1.2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగానే ఎదుగుతాం. ఇది సరిపోదని..3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌–2047 తీసుకొచ్చాం. కేవలం ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఈ లక్ష్యానికి చేరుకోలేం. మనకు ఒక ‘ఉత్పాదకత షాక్‌’ అవసరం. పెట్టుబడి రేటును జీఎస్డీపీలో 52 శాతానికి పెంచాలనే కఠిన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం..’ అని భట్టి తెలిపారు.

తర్వలో హిల్ట్‌ పీ మార్గదర్శకాలు: శ్రీధర్‌బాబు 
పదేళ్ల పాటు సాగిన బీఆర్‌ఎస్‌ పాలనలో చాలాచోట్ల అడ్డగోలు భూకేటాయింపులు జరిపిన విషయం వాస్తవమని.. తొలుత మాట్లాడిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పరిశ్రమల పేరిట జరిగిన ఈ భూకేటాయింపులపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పారు. ‘హిల్ట్‌ పాలసీ ఏకపక్ష నిర్ణయం కాదు. నిపుణులు, మేధావులతో చర్చించిన తర్వాతే రూపొందించాం. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయి. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులను పబ్లిక్‌ డొమైన్‌ (అందరికీ అందుబాటు)లో పెట్టం. అవి కేవలం ఇన్‌ కెమెరా (అంతర్గత) సూచనలు. వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పాజిటివ్‌గా చూడాలి. అప్పుడే నిర్ణయాల అమలు వేగవంతంగా, విజయవంతంగా పూర్తవుతుంది. పరిశ్రమల తరలింపుతో కార్మికులకు ఉపాధి ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన అవసరం లేదు. కారి్మక చట్టాలు తప్పకుండా అమల్లో ఉంటాయి..’ అని శ్రీధర్‌బాబు చెప్పారు.  

పూర్తి పారదర్శక పాలసీ: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
పారిశ్రామిక భూమి బదలాయింపు విధానం రాష్ట్ర సుస్థిర పురోగతితో పాటు పారిశ్రామిక కాలుష్య రహిత హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పూర్తి పారదర్శకంగా ఉండేలా గొప్ప పాలసీకి రూపకల్పన చేశామని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. లీజు హక్కులతో ఉన్న పారిశ్రామిక భూములకు ఈ కొత్త విధానం వర్తించదని, పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో భూములు కలిగిఉన్న పారిశ్రామిక భూములకే వర్తిస్తుందని స్పష్టం చేశారు.  

ఆ జీవోలో చీకటి కోణాలు: ఏలేటి 
‘కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు పంపడం సరైన నిర్ణయమే. కానీ ఎలాంటి పర్యావరణ అధ్యయనాలు, కమిటీల నివేదికలు లేకుండా బయటకు తరలే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించకుండా హడావుడిగా హిల్ట్‌ పాలసీని తేవడంలో ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వం జారీ చేసిన జీఓ 27లో అనేక చీకటి కోణాలు ఉన్నాయి. 22 పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలను ఔటర్‌ రింగు రోడ్డు వెలుపల ఎక్కడికి తరలిస్తారు? అత్యంత కాలుష్య కారక పరిశ్రమలున్న ఐడీఏ బొల్లారంను హిల్ట్‌ పాలసీలో చేర్చకపోవడం విడ్డూరం..’ అని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమల భూములతో రియల్‌ ఎస్టేట్‌ దందా చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పచ్చదనం పెంచాలి..’ అని సూచించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన హిల్ట్‌ పాలసీని అందరూ స్వాగతించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోందని, ఇదే తరహాలో కాలుష్యం పెరిగితే పదేళ్లలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తుతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.  

ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు: పాల్వాయి హరీశ్‌బాబు 
‘మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ అంటూ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. గ్లోబల్‌ సమ్మిట్‌లో విజన్‌ డాక్యుమెంట్‌–2047 విడుదల చేశారు. ఇప్పుడు అక్కడ టెంట్లు కూడా లేవు. ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు..’ అని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని మరో బీజేపీ సభ్యుడు పాయల్‌ శంకర్‌ అన్నారు. 

హిల్ట్‌ పాలసీకి చట్టబద్ధత లేదు: అక్బరుద్దీన్‌ 
‘వనరుల సమీకరణకు ఈ ప్రభుత్వం భూముల వెనుక పరిగెడుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన హిల్ట్‌ పాలసీ జీఓకు ఎలాంటి చట్టబద్ధత లేదు. పాలసీ రూపకల్పనలో పారదర్శకత కనిపించడం లేదు. పాలసీలో పేర్కొన్న భూములు ప్రైవేటువా లేక ప్రభుత్వ భూములా అనే అంశంపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలి..’ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుదీన్‌ ఒవైసీ అన్నారు. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. నగర కాలుష్యాన్ని నివారించేందుకు ఉద్దేశించిన హిల్ట్‌ పాలసీకి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చెప్పారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement