Telangana: ఎస్సై కావలెను..! | Tandur Police Station SI Post Vacant For Two Months | Sakshi
Sakshi News home page

Telangana: ఎస్సై కావలెను..!

Mar 4 2026 1:45 PM | Updated on Mar 4 2026 1:49 PM

Tandur Police Station SI Post Vacant For Two Months

మంచిర్యాల జిల్లా: పోలీసు సబ్‌ డివిజన్‌ కేంద్రం బెల్లంపల్లి తర్వాత తాండూర్‌ పోలీసుస్టేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లా సరిహద్దులో ఉన్న స్టేషన్‌లో గత రెండు నెలలుగా ఎస్సై పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడి ఎస్సై కిరణ్‌కుమార్‌ గత డిసెంబర్‌ 30న హాజీపూర్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యారు. మాదారం ఎస్సై ఇన్‌చార్జిగా కొనసాగుతూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌–చంద్రాపూర్‌ జాతీయ రహదారి ఈ స్టేషన్‌ మీదుగానే సాగుతుంది. రెగ్యులర్‌ ఎస్సై లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో డిమాండ్‌ ఉన్న ఠాణా కావడంతో సబ్‌ డివిజన్‌ డివిజన్‌లోని ఓ గ్రామీణ ప్రాంత పోలీసుస్టేషన్‌ ఎస్సై తాండూర్‌కు బదిలీ కోసం ఓ ప్రజాప్రతినిధి అనుయాయుల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 

సానుకూలత వ్యక్తమైనా మరో ఠాణాకు ఆయనకు సంబంధించిన ఎస్సైని బదిలీ చేయించే విషయంలో పేచీ పడినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ కారణంగానే బదిలీ ప్రక్రియ నిలిచినట్లు తెలుస్తోంది. ఆ ఎస్సైతోపాటు మరో ఇద్దరు ఎస్సైలు కూడా ప్రయత్నాలు చేసి అర్థంతరంగా మానుకున్నట్లు తెలుస్తోంది. బదిలీపై రావడానికి ముగ్గురు ఎస్సైలు సిద్ధంగా ఉన్నా ప్రక్రియ ముందుకు సాగకపోవడం చర్చనీయాంశమైంది. తాండూర్‌ ప్రాంతంలో జాతీయ రహదారిపై పలు చోట్ల బ్లాక్‌స్పాట్లు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, పలువురి మృతి, గాయపడిన సంఘటనలు, మందుబాబులు, ఆకతాయిల ఆగడాలు, అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటుంటాయి.

గంజాయి రవాణా మార్గం
రాష్ట్రంలోకి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, బల్లార్షా తదితర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవా ణా జరుగుతోంది. తాండూర్‌, బెల్లంపల్లి, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సై పోస్టును భర్తీ చేస్తే శాంతిభద్రతలు పరిరక్షించే అవకాశం ఉంటుందని మండల వాసులు కోరుతున్నారు.

నకిలీ పత్తి విత్తనాలకు అడ్డా...!
పత్తి విత్తనాలు ఈ ప్రాంతానికి చేరుకోవడం, గుట్టుగా విక్రయించడం కొంతకాలంగా సాగుతోంది. నాలుగేళ్ల క్రితం రూ.కోటికి విలువైన పత్తి విత్తనాలను పట్టుకుని పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. గత ఏడాది తాండూర్‌లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. తాండూర్‌ కేంద్రంగా భీమిని, కన్నెపల్లి మండలాలకు సరఫరా అవుతాయనే ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement