breaking news
Land conversion
-
ఏ విచారణకైనా రెడీ
హైదరాబాద్‌లో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. నిర్దేశిత ప్రమాణాలను మించిపోయింది. ఇటీవల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 263 నమోదైంది. వాహనాలతో 27% వాయుకాలుష్యం ఏర్పడుతుంటే, పరిశ్రమలతో 51% ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించడానికి 2012 నుంచే ప్రయ త్నాలు జరుగుతున్నాయి. మేం ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తాం. వాటికి ప్రత్యామ్నాయ పారిశ్రామికవాడలను సిద్ధంగా ఉంచాం.. – డిప్యూటీ సీఎం భట్టిసాక్షి, హైదరాబాద్: 2014 నుంచి, ఇటీవల తమ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్‌పీ తో పాటు ఇప్పటివరకు జరిగిన పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై ఏ విచారణను ఆదేశించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. ఆ మేరకు లేఖ రాసిన మరుక్షణం ఏ విచారణ సంస్థతో కావాలంటే ఆ సంస్థతో విచారణ చేయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మంగళవారం శాసనసభలో హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి (హిల్ట్) విధానం (పీ), తెలంగాణ రైజింగ్–2047పై లఘు చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలకు భట్టి జవాబిచ్చారు. హిల్ట్ పీతో రూ.10,776 కోట్ల ఆదాయం: ‘ప్రతిపక్షం కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని పట్టించుకోకుండా తమ రాజకీయం కోసం రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం లీజు భూములను ఫ్రీహోల్డ్ చేసింది. తమకు కావాల్సిన వాళ్లకు పారిశ్రామిక భూములను వినియోగ మార్పిడి చేసింది. సిరీస్, గల్ఫ్ ఆయిల్ పరిశ్రమలకు భూ వినియోగ మార్పిడి చేసిన అంశాన్ని హిల్ట్ పాలసీతో పోల్చినప్పుడు రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.4,076 కోట్ల నష్టం వాటిల్లింది. హిల్ట్ పీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం.. 80 అడుగుల లోపు రహదారి ఉన్న భూములకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎస్ఆర్వో) ధరలో 30 శాతం, 80 అడుగుల కంటే ఎక్కువ వెడల్పుతో రహదారి ఉన్నచోట ఎస్ఆర్వో ధరలో 50 శాతం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. కేవలం భూ వినియోగ మార్పిడి చేస్తున్నందుకు ఈ ఫీజులు వసూలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న భూ వినియోగ మార్పిడి ధరల ప్రకారం అయితే కేవలం రూ.574 కోట్ల ఆదాయం మాత్రమే రాష్ట్రానికి లభిస్తుంది. అదే హిల్ట్ పీ కింద దాదాపు 4,780 ఎకరాల భూములకు భూ వినియోగ మార్పిడికి అవకాశం కల్పించడం ద్వారా దాదాపు రూ.10,776 కోట్ల ఆదాయం లభిస్తుంది..’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. హిల్ట్ పీ అత్యుత్తమం, పారదర్శకమైనది.. ‘హిల్ట్ పాలసీ రాగానే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఓ నాయకుడు ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్రంలోని భూములన్నింటినీ అమ్మేస్తూ రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు తెరలేపారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించి, బట్ట కాల్చి మీద వేసి తుడుచుకోమంటున్నారు. వారు రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కంటే.. సొంత ప్రయోజనాల కోసం ఎక్కువగా పాకులాడుతున్నారు. హిల్ట్ పీ వల్ల రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంటే.. గతంలో వారు చేసిన నిర్ణయాలతో భారీ నష్టం జరిగింది. గత ప్రభుత్వం అనుసరించి విధానాలతో పోలిస్తే హిల్ట్ పీ అత్యుత్తమమైనది. పారదర్శకమైనది. ఆదాయం సమకూరుతుంది. వారు ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ భూములు లీజులో ఉంటే...వాటిని వేలానికి పెట్టకుండా ఇష్టానుసారం ఇచ్చేశారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పారిశ్రామికవేత్తలకు అప్పగించారు. వనరుల సమీకరణకు 2019లో అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీకి సంబంధం లేకుండా కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా జీవో ఇచ్చి పారిశ్రామిక భూములను ఐటీ పరిశ్రమలకు మార్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. వారికి అనుకూలమైన వారికి భూ మార్పిడి చేశారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. మేము తెచ్చిన పాలసీలో దోపిడీకి ఆస్కారం లేదు..’ అని భట్టి చెప్పారు. రాష్ట్రానికి ఉత్పాదక షాక్ అవసరం ‘ప్రస్తుతం రాష్ట్రం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. వృద్ధి ఇలానే కొనసాగితే 2047 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగానే ఎదుగుతాం. ఇది సరిపోదని..3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047 తీసుకొచ్చాం. కేవలం ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఈ లక్ష్యానికి చేరుకోలేం. మనకు ఒక ‘ఉత్పాదకత షాక్’ అవసరం. పెట్టుబడి రేటును జీఎస్డీపీలో 52 శాతానికి పెంచాలనే కఠిన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం..’ అని భట్టి తెలిపారు.తర్వలో హిల్ట్ పీ మార్గదర్శకాలు: శ్రీధర్‌బాబు పదేళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో చాలాచోట్ల అడ్డగోలు భూకేటాయింపులు జరిపిన విషయం వాస్తవమని.. తొలుత మాట్లాడిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పరిశ్రమల పేరిట జరిగిన ఈ భూకేటాయింపులపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పారు. ‘హిల్ట్ పాలసీ ఏకపక్ష నిర్ణయం కాదు. నిపుణులు, మేధావులతో చర్చించిన తర్వాతే రూపొందించాం. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయి. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులను పబ్లిక్ డొమైన్ (అందరికీ అందుబాటు)లో పెట్టం. అవి కేవలం ఇన్ కెమెరా (అంతర్గత) సూచనలు. వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పాజిటివ్‌గా చూడాలి. అప్పుడే నిర్ణయాల అమలు వేగవంతంగా, విజయవంతంగా పూర్తవుతుంది. పరిశ్రమల తరలింపుతో కార్మికులకు ఉపాధి ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన అవసరం లేదు. కారి్మక చట్టాలు తప్పకుండా అమల్లో ఉంటాయి..’ అని శ్రీధర్‌బాబు చెప్పారు. పూర్తి పారదర్శక పాలసీ: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పారిశ్రామిక భూమి బదలాయింపు విధానం రాష్ట్ర సుస్థిర పురోగతితో పాటు పారిశ్రామిక కాలుష్య రహిత హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పూర్తి పారదర్శకంగా ఉండేలా గొప్ప పాలసీకి రూపకల్పన చేశామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. లీజు హక్కులతో ఉన్న పారిశ్రామిక భూములకు ఈ కొత్త విధానం వర్తించదని, పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో భూములు కలిగిఉన్న పారిశ్రామిక భూములకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆ జీవోలో చీకటి కోణాలు: ఏలేటి ‘కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు పంపడం సరైన నిర్ణయమే. కానీ ఎలాంటి పర్యావరణ అధ్యయనాలు, కమిటీల నివేదికలు లేకుండా బయటకు తరలే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించకుండా హడావుడిగా హిల్ట్ పాలసీని తేవడంలో ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వం జారీ చేసిన జీఓ 27లో అనేక చీకటి కోణాలు ఉన్నాయి. 22 పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపల ఎక్కడికి తరలిస్తారు? అత్యంత కాలుష్య కారక పరిశ్రమలున్న ఐడీఏ బొల్లారంను హిల్ట్ పాలసీలో చేర్చకపోవడం విడ్డూరం..’ అని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమల భూములతో రియల్ ఎస్టేట్ దందా చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పచ్చదనం పెంచాలి..’ అని సూచించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన హిల్ట్ పాలసీని అందరూ స్వాగతించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోందని, ఇదే తరహాలో కాలుష్యం పెరిగితే పదేళ్లలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తుతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు: పాల్వాయి హరీశ్‌బాబు ‘మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. గ్లోబల్ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్–2047 విడుదల చేశారు. ఇప్పుడు అక్కడ టెంట్లు కూడా లేవు. ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు..’ అని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని మరో బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అన్నారు. హిల్ట్ పాలసీకి చట్టబద్ధత లేదు: అక్బరుద్దీన్ ‘వనరుల సమీకరణకు ఈ ప్రభుత్వం భూముల వెనుక పరిగెడుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన హిల్ట్ పాలసీ జీఓకు ఎలాంటి చట్టబద్ధత లేదు. పాలసీ రూపకల్పనలో పారదర్శకత కనిపించడం లేదు. పాలసీలో పేర్కొన్న భూములు ప్రైవేటువా లేక ప్రభుత్వ భూములా అనే అంశంపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలి..’ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుదీన్ ఒవైసీ అన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. నగర కాలుష్యాన్ని నివారించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీకి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చెప్పారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. -
Bapatla: జిల్లాలో అక్రమ లేఅవుట్ల దందా
‘బాపట్ల మండలం ఈతేరులో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కర్లపాలెంలో ఓ లే అవుట్ వేసింది. దీంతో కర్లపాలెం వాసులు కరీముల్లా ఖాన్, అబ్దుల్ సమీద్, శ్రీనివాసరావు, విజయ్ కుమార్, గోపీ, పవన్‌కుమార్, సోమయ్య తదితరులు ప్లాట్లను కొని అడ్వాన్స్‌గా రూ.20 లక్షలు చెల్లించారు. తీరా చూస్తే ఆ లేఅవుట్‌కు అనుమతి లేదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని నిలదీశారు. ఇచ్చిన నగదును తిరిగిచ్చే ప్రసక్తే లేదని ఆ వ్యాపారి తెగేసి చెప్పాడు. దీంతో బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. సాక్షి, బాపట్ల: జిల్లాలో అనధికారిక లే అవుట్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొందరు అక్రమ లే అవుట్లను వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీల్లో క్రమబద్ధీకరణకు అవకాశం లేకపోవడం, క్షేత్ర స్థాయిలో నిఘా సన్నగిల్లడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. పాలనా సౌలభ్యం కోసం బాపట్లను జిల్లాగా ప్రకటించడంతో పట్టణ పరిసరాల్లోని 15 కిలోమీటర్ల పరిధిలో వందల సంఖ్యలో లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. ఒక్కదానికీ అనుమతుల్లేవు. అయినా వ్యాపారులు యథేచ్ఛగా ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. అధికారులూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గుర్తించినవి ఇవే.. ► బాపట్ల పురపాలక సంఘం పరిధిలో మొత్తం 61 లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 24 లేఅవుట్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. 35 లేఅవుట్లకు లేవు. కానీ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ► జిల్లాలో దాదాపు 150 వరకు అనధికార లే అవుట్లు ఉన్నట్టు అధికారులే చెబుతున్నారు. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వీటిపై చర్యలు లేవు. నిబంధనలివీ.. ► వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా మార్చాలంటే ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేయాలి. దీనికోసం ప్రభుత్వానికి ఐదుశాతం ఫీజు చెల్లించాలి. ► అధికారుల అనుమతితోనే లేఅవుట్ వేయాలి. ► 40 అడుగుల రోడ్లు ఉండాలి. ► 10 శాతం భూమిని సామాజిక అవసరాలకు కేటాయించాలి. ► తాగునీటికి, విద్యుత్ సౌకర్యానికి రుసుములు చెల్లించాలి. ► కానీ ఇవేమీ అమలు కావడం లేదు. ప్రభుత్వం అవకాశం ఇచ్చినా..! అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొని ప్రజలు నష్టపోతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం అనధికార లే అవుట్లకు క్రమబద్ధీకరణ పథకం–2020ని ప్రకటించింది. 2019 ఆగస్టు 31కి ముందు వేసిన అనధికార లే –అవుట్లలోని ప్లాట్లు నిర్ణీత అపరాధ రుసుముతోపాటు 14 శాతం ఓపెన్ స్పేస్ మొత్తం చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటును చాలా వరకు రియల్టర్లు ఉపయోగించుకున్నారు. స్పందన బాగుండడంతో ఈ ఏడాది జూన్ 30 వరకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పథకాన్ని ఆపేసింది. అయితే అనధికార లేఅవుట్లలో నిర్మించుకున్న భవనాలను వ్యక్తిగతంగా అపరాధ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. అవకాశం ఇచ్చినా కొందరు వ్యాపారులు వినియోగించుకోలేదు. (క్లిక్: పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు) కలెక్టర్ సీరియస్.. జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణ పథకానికి దరఖాస్తు చేసుకున్న అనధికార లే అవుట్లకు సంబంధించి అపరాధ రుసుం రూపంలో రూ.16 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. దీనిపై కలెక్టర్ విజయకృష్ణన్ ఇటీవల సీరియస్ అయ్యారు. తక్షణమే అపరాధ రుసుం వసూలు చేయాలని, ఇంకా ఉన్న అనధికార లే అవుట్లపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ భూముల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి నిషేధిత జాబితాలో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో రియల్టర్లలో ఆందోళన మొదలైంది. చర్యలకు ఉపక్రమిస్తున్నాం పంచాయతీల్లో అనధికార లే–అవుట్లను గుర్తిస్తున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్ ఆదేశించారు. ఆ లే అవుట్లను గుర్తించి త్వరలోనే కలెక్టర్ ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో పెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. – ఎ.రమేష్, జిల్లా పంచాయతీ అధికారి -
వెంచర్లో ప్లాట్ కొంటే.. ఇంటికి పాస్‌బుక్ వచ్చింది.. ఇదేంటని అడిగితే
భువనగిరి మండలం చీమల కోడూరు గ్రామ పరిధిలో చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లో రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ 120 గజాల ప్లాటు బుక్ చేసుకున్నాడు. డబ్బులు చెల్లించడంలో జాప్యం కారణంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ జరగలేదు. ఇటీవల ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం భువనగిరి మండల కార్యాలయానికి పిలిస్తే వెళ్లి తతంగం పూర్తి చేశారు. వారం రోజులకు ఇంటి అడ్రస్‌కు గుంట భూమి (వ్యవసాయ భూమి) పట్టా చేసినట్లు పాస్ పుస్తకం వచ్చింది. తాను కొనుగోలు చేసినది ప్లాట్ కదా అని సదరు వెంచర్ వాళ్లను అడిగితే .. ప్లాట్ కింద వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పి సమస్యేం లేదని సముదాయించారు. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ‘నాలా’(వ్యవసాయేతర భూమిగా) కింద కన్వర్షన్ చేయించుకుంటే సరిపోతుందని చెప్పారు’ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని, అధికారుల అండతో రియల్ ఎస్టేట్ యజమానులు వ్యవసాయ భూములను నివాస యోగ్యమైన ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు పట్టణాభివృద్ధి సంస్థలు లేదా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ (డీటీసీపీ) ఆమోదించిన లే అవుట్ తప్పనిసరని ప్రభుత్వం గత సంవత్సరం స్పష్టం చేసింది. డీటీసీపీ, పట్టణాబివృద్ధిసంస్థలు ఆమోదించిన లే అవుట్లలోని ప్లాట్లనే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలని, ఇతర భూములన్నీ ధరణి కింద తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మండల తహసీల్దార్లకు రిజిస్ట్రార్ హోదా కల్పించింది. అయితే వీటిల్లోని లొసుగులను ఆధారంగా చేసుకున్న రియల్ వ్యాపారులు గుంట, గుంటన్నర భూములను కూడా వ్యవసాయ భూములుగా చూపిస్తూ ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ల వద్ద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించినహెచ్ఎండీఏ పరిధిలోని మండలాలతో పాటు ఇటీవల డిమాండ్ పెరిగిన కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ పట్టణాభివృద్ధి సంస్థలతో పాటు భువనగిరి, జనగాం, పెద్దపల్లి, సిరిసిల్ల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల పరిధిలోని మునిసిపాలిటీలలో ఈ తరహాలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ సాగుతోంది. చదవండి: ఎక్కడి నుంచో రేగు పండ్ల వాసన.. ఆధునిక, వైజ్ఞానిక మేళవింపు ‘నాలా’కన్వర్షన్‌తో కొన్ని... వ్యవసాయ భూములను రియల్ వెంచర్లుగా మార్చాలంటే ‘నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్ (నాలా) ’కింద వ్యవసాయేతర భూమిగా మార్చడం తప్పనిసరి. అక్కడున్న పట్టణీకరణ పరిస్థితులను బట్టి తహసీల్దార్లు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా గుర్తించాల్సి ఉంటుంది. ఫీజుతో పాటు ఇతర ‘చెల్లింపులు’జరిపితే తప్ప నాలా కన్వర్షన్ సులభం కాదు. ఈ నేపథ్యంలో కొందరు రియల్టర్లు ‘నాలా’మార్పిడి లేకుండానే తహసీల్దార్లతో ధరణి కింద ప్లాట్లకు పట్టాలు ఇప్పిస్తుండగా, మరికొందరు రియల్టర్లు కొంత అడ్వాన్స్ అయ్యారు. కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని ప్లాట్ల వారీగా విభజించి ‘నాలా’కన్వర్షన్ చేయించి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. ప్లాట్లకు నాలా కన్వర్షన్ ఉంటే డీసీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులేమీ లేకుండానే రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. డీటీసీపీ, రెరా చట్టాలన్నీ గాలికి... రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లన్నీ డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల అనుమతితోనే చేపట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ల ద్వారా లే అవుట్లకు అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే 8 ప్లాట్లు అంతకన్నా ఎక్కువ మొత్తంలో విక్రయించాల్సి వస్తే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అనుమతి తప్పనిసరి. కానీ స్థానిక తహసీల్దార్లు, రిజిస్ట్రార్లను ‘మంచి’చేసుకొని రియల్టర్లు అనధికార లే అవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. డీటీసీపీ లే అవుట్‌తో చేసిన వెంచర్లకు కూడా రెరా అనుమతి ఉండడం లేదు. ప్రతి పట్టణ పరిధిలో ఇలాంటి వెంచర్లు పుట్టుకొస్తున్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. -
అక్రమార్కులకు వేసవి ‘బొనాంజ’
సాక్షి, తణుకు : వేసవి కాలం వచ్చిందంటే చాలు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మట్టి పేరుతో యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ కాసులు ఆర్జిస్తున్నారు. ఒక పక్క అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతుండగా మరోపక్క ప్రభుత్వానికి ఎలాంటి కన్వర్షన్ ఫీజులు చెల్లించకుండానే పూడికలు చేపడుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని పెద్ద ఎత్తున పొలాలను పూడ్చుతున్నప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తణుకుతో పాటు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డెల్టాలోని తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు తదితర పట్టణ సమీప ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. మరోవైపు ట్రాక్టర్లు, లారీల్లో మట్టి తరలిస్తుండటంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. జాతీయ రహదారిపై సైతం అపసవ్య దిశలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ పర్యవేక్షించాల్సిన పెట్రోలింగ్ సిబ్బంది పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు ఏవి? ఇళ్ల స్థలాలకు అనువుగా వరిచేలను లేఅవుట్లుగా మార్చుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వానికి 3 శాతం రుసుం చెల్లించడంతో పాటు భూమార్పిడి చేయించుకోవాలి. అనంతరం వరిచేలను పూడ్చడానికి మట్టి అవసరం అవుతుంది. చేలల్లో మట్టి దిబ్బల నుంచి మట్టిని తవ్వుకోవడానికి ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. గనుల శాఖకు రుసుం చెల్లించి అనుమతులు తెచ్చుకుని మట్టితో పూడ్చుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే తణుకు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారితో పాటు ప్రధాన రోడ్లు అనుకుని ఉన్న భూములను కొబ్బరి ఇతరత్రా పంటలు వేసుకుంటున్నామనే సాకుతో పూడికలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు మాత్రమే చెల్లించి మట్టి అనుమతులు తీసుకోకుండా పూడికలు కానిచ్చేస్తున్నారు. తణుకు పట్టణ పరిధితో పాటు మండలం పరిధిలోని దువ్వ, తేతలి, ముద్దాపురం, మండపాక తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే పూడికలు కానిచ్చేస్తున్నారు. ఇటు రెవెన్యూ, అటు గనుల శాఖకు చెందిన అధికారులు సైతం మామళ్ల మత్తులో జోగుతూ ఇష్టానుసారం మట్టిని తవ్వుకుంటూ తరలిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా వందల ఎకరాల్లో పూడికలు చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్లాది రూపాయిల ఫీజులను ఎగ్గొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నియంత్రణ లేని వాహనాలు ఒకపక్క అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్న అక్రమార్కులు వాహనాలపై సరైన నియంత్రణ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాక్టర్లు, లారీల్లో మట్టిని ఎత్తుగా వేసుకుని అతి వేగంగా రహదార్లుపై నడుపుతున్నారు. తణుకు మండలం దువ్వ జాతీయ రహదారి ఆనుకుని పెద్ద ఎత్తున పూడ్చుతున్న నిర్వాహకులు వాహనాలను ఇష్టానురీతిగా నడుపుతున్నారు. జాతీయ రహదారి నుంచి వరిచేలల్లోకి సబ్ రోడ్లు నిర్మించేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను గమనించకుండానే మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, లారీలు ఒక్కసారిగా హైవేపైకి దూసుకువస్తున్నాయి. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు డ్రైవర్లు సైతం చెవులకు ఇయర్ ఫోన్లు పెట్టుకుని సినిమా పాటలు వింటూ రోడ్డుపై వెళ్లే వారికి దారి ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొందరు డ్రైవర్లకు కనీసం లైసెన్సులు లేకపోగా ఒక్కో వాహనంలో మైనర్లే డ్రైవింగ్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం నుంచి సక్రమంగా అనుమతులు తీసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంలు చెల్లించేలా అధకారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అనుమతులు తప్పనిసరి మట్టి పూడిక చేసినా లేక పొలాల్లోని మట్టిని తవ్వి తరలించుకోవాలనుకున్నా గనుల శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాహనాలు రాకపోకలు సాగించాలి. – ఎల్.శివకుమార్, తహసీల్దార్, తణుకు -
‘భూ మార్పిడి’లో హస్తలాఘవం
తప్పుగా లెక్కిస్తూ ఖజానాకు నష్టం కలిగిస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నప్పుడు విధిగా భూమార్పిడి అనుమతులు పొందాలి. దానికి సంబంధించి ఫీజులు, ముందస్తు అనుమతి లేనప్పుడు ప్రభుత్వానికి జరిమానా చెల్లించాలి. ఈ విషయంలో అధికారులు యథేచ్ఛగా హస్త లాఘవం ప్రదర్శిస్తున్నారని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. ఒక్క రంగారెడ్డి తూర్పు విభాగం పరిధిలోనే 774 మంది/సంస్థలు 4,310 ఎకరాల భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ భూముల మార్పిడికి సంబంధించి అనుమతులు పొందలేదు. దాంతో మార్పిడి పన్ను/జరిమానాలకు సంబంధించి రూ. 296.27 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ కాలేదు. ఇదే ప్రాంతంలో కొందరు మాత్రం పన్ను చెల్లించినా... అధికారులు తప్పుగా లెక్కించి ఖజానాకు నష్టం కలిగించారు. 58 ఎకరాలకు సంబంధించి రూ. 2.87 కోట్లు వసూలు కావాల్సి ఉండగా... రూ. 1.64 కోట్లే వసూలు చేశారు. చేవెళ్ల డివిజన్లో 28.22 ఎకరాల భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించి రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చింది. ఇందుకు రూ. 20.49 కోట్ల మేరకు భూ మార్పిడి పన్ను, జరిమానా నోటీసులు జారీ చేయాల్సి ఉన్నా అధికారులు స్పందించలేదు. చేవెళ్ల, మెదక్ డివిజన్లలో భూ వినియోగ మార్పిడికి సంబంధించి ఫీజు, జరిమానా నోటీసుల్లో విస్తీర్ణాన్ని 14.38 ఎకరాలకు గాను 1.07 ఎకరాలుగా చూపారు. ఫలితంగా రూ. 8.64 కోట్ల మేర ప్ర భుత్వ ఖజానాకు నష్టం కలిగింది. 2006-2012 మధ్య కాలంలో తెలంగాణతో పాటు ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు భూ మార్పిడి ఫీజు చెల్లించలేదు. 13,153 ఎకరాలకు సంబంధించి 84.54 కోట్ల ఎగవేత జరిగింది.


