Bapatla: జిల్లాలో అక్రమ లేఅవుట్ల దందా

Bapatla District: Collector instructs Officials to Action Illegal Layouts - Sakshi

వందల సంఖ్యలో పుట్టుకొచ్చిన వైనం

ప్లాట్లు కొని మోసపోతున్న ప్రజలు

సీరియస్‌ అయిన కలెక్టర్‌ విజయకృష్ణన్‌

నిషేధిత జాబితాలో చేర్చేందుకు కసరత్తు 

‘బాపట్ల మండలం ఈతేరులో ఉన్న ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కర్లపాలెంలో ఓ లే అవుట్‌ వేసింది. దీంతో కర్లపాలెం వాసులు కరీముల్లా ఖాన్, అబ్దుల్‌ సమీద్, శ్రీనివాసరావు, విజయ్‌ కుమార్, గోపీ, పవన్‌కుమార్, సోమయ్య తదితరులు ప్లాట్లను కొని అడ్వాన్స్‌గా రూ.20 లక్షలు చెల్లించారు. తీరా చూస్తే ఆ లేఅవుట్‌కు అనుమతి లేదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని నిలదీశారు. ఇచ్చిన నగదును తిరిగిచ్చే ప్రసక్తే లేదని ఆ వ్యాపారి తెగేసి చెప్పాడు. దీంతో 
బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు.   

సాక్షి, బాపట్ల: జిల్లాలో అనధికారిక లే అవుట్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొందరు అక్రమ లే అవుట్లను వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీల్లో క్రమబద్ధీకరణకు అవకాశం లేకపోవడం, క్షేత్ర స్థాయిలో నిఘా సన్నగిల్లడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. పాలనా సౌలభ్యం కోసం బాపట్లను జిల్లాగా ప్రకటించడంతో పట్టణ పరిసరాల్లోని 15 కిలోమీటర్ల పరిధిలో వందల సంఖ్యలో లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. ఒక్కదానికీ అనుమతుల్లేవు. అయినా వ్యాపారులు యథేచ్ఛగా ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. అధికారులూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.   

గుర్తించినవి ఇవే..   
► బాపట్ల పురపాలక సంఘం పరిధిలో మొత్తం 61 లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 24 లేఅవుట్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. 35 లేఅవుట్లకు లేవు. కానీ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 

► జిల్లాలో దాదాపు 150 వరకు అనధికార లే అవుట్లు ఉన్నట్టు అధికారులే చెబుతున్నారు. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వీటిపై చర్యలు లేవు.  

నిబంధనలివీ..  
► వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా మార్చాలంటే ముందుగా ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయాలి. దీనికోసం ప్రభుత్వానికి ఐదుశాతం ఫీజు చెల్లించాలి.  
► అధికారుల అనుమతితోనే లేఅవుట్‌ వేయాలి.  
► 40 అడుగుల రోడ్లు ఉండాలి.  
► 10 శాతం భూమిని సామాజిక అవసరాలకు కేటాయించాలి.  
► తాగునీటికి, విద్యుత్‌ సౌకర్యానికి రుసుములు చెల్లించాలి.  
► కానీ ఇవేమీ అమలు కావడం లేదు.  

ప్రభుత్వం అవకాశం ఇచ్చినా..! 
అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొని ప్రజలు నష్టపోతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం అనధికార లే అవుట్లకు క్రమబద్ధీకరణ పథకం–2020ని ప్రకటించింది. 2019 ఆగస్టు 31కి ముందు వేసిన అనధికార లే –అవుట్లలోని ప్లాట్లు నిర్ణీత అపరాధ రుసుముతోపాటు 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ మొత్తం చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటును చాలా వరకు రియల్టర్లు ఉపయోగించుకున్నారు. స్పందన బాగుండడంతో ఈ ఏడాది జూన్‌ 30 వరకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పథకాన్ని ఆపేసింది. అయితే అనధికార లేఅవుట్లలో నిర్మించుకున్న భవనాలను వ్యక్తిగతంగా అపరాధ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. అవకాశం ఇచ్చినా కొందరు వ్యాపారులు వినియోగించుకోలేదు. (క్లిక్‌: పాఠం స్కాన్‌ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు)

కలెక్టర్‌ సీరియస్‌.. 
జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణ పథకానికి దరఖాస్తు చేసుకున్న అనధికార లే అవుట్లకు సంబంధించి అపరాధ రుసుం రూపంలో రూ.16 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. దీనిపై కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఇటీవల సీరియస్‌ అయ్యారు. తక్షణమే అపరాధ రుసుం వసూలు చేయాలని, ఇంకా ఉన్న అనధికార లే అవుట్లపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ భూముల వివరాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపి నిషేధిత జాబితాలో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో రియల్టర్లలో ఆందోళన మొదలైంది. 

చర్యలకు ఉపక్రమిస్తున్నాం 
పంచాయతీల్లో అనధికార లే–అవుట్లను గుర్తిస్తున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమ లే అవుట్‌లపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్‌ ఆదేశించారు. ఆ లే అవుట్లను గుర్తించి త్వరలోనే  కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో పెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం.  – ఎ.రమేష్, జిల్లా పంచాయతీ అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top