సాక్షి, హైదరాబాద్: కర్నూలులో(Kurnool Bus Fire Accident) జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతిచెందారు. వారిని ఏపీకి చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణకు చెందిన అనూషరెడ్డిగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి.. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ధాత్రి ఇటీవల హైదరాబాద్‌లోని మేనమామ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
అదే బస్సులో అనూషరెడ్డి కూడా వెళ్లారు. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి బెంగళూరుకు బయల్దేరారు. ఖైరతాబాద్‌లో అనూషరెడ్డి బస్సు ఎక్కి ఈ దుర్ఘటనలో మృతిచెందారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు.
ఇదిలా ఉండగా.. వేమురి కావేరి ట్రావెల్స్(vemuri Kaveri Travels) బస్సు ప్రమాదం బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణీకులు మృతి చెందిన విషయం తెలిసిందే.


