సాక్షి, హైదరాబాద్: ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు, చెన్నైకు స్లీపర్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. శంషాబాద్‌లో అందుబాటులో ఉండే ఈ ఆర్టీసీ స్లీపర్ బస్సులు.. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరనున్నాయి. రాజమండ్రి, కాకినాడ, విశాఖకు అదనపు బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. విమానాల రద్దుతో భారత రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్-చెన్నై,చర్లపల్లి- కోల్‌కత్తా, హైదరాబాద్ నుంచి ముంబైకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. 37 రైళ్లకు 116 కోచ్‌లు జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అదనపు బోగీలతో కొన్ని రైళ్లు నడుస్తున్నాయి.
కాగా, రేణిగుంట విమానాశ్రయంలోనూ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థ తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఒక పక్క సంక్షోభం కొనసాగుతుండగానే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


