మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ గ్రామ పంచాయతీలో ఈ నెల 11న జరగనున్న పంచా యతీ ఎన్నికల్లో వదిన, మరిది మ ధ్య రసవత్తర పోరు సాగుతోంది. హాజీపుర్‌కు చెందిన మాధవరపు రామారావు భార్య శ్రీలత బీఆర్‌ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా రామారావు సోదరుడు వెంకటరమణారావు బీజేపీ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వదిన, మరిది మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

బరిలో తోడికోడళ్లు...
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని టీకానపల్లి పంచాయతీలో తోడికోడళ్లు సర్పంచ్ పదవికోసం పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన బద్రి రమేశ్ భార్య సౌజన్య బీఆర్‌ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా అతని సోదరుడు బద్రి వేణు భార్య లక్ష్మి బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా మాధవరపు శైలజ పోటీలో ఉంది. మరి ముగ్గురిలో విజయం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సర్పంచ్‌గా నాడు భర్త.. నేడు భార్య
దండేపల్లి: 2019 పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మామిడిపల్లి సర్పంచ్‌గా ఎల్తపు శ్రీనివాస్ గెలుపొందాడు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్‌స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో శ్రీనివాస్ తన భార్య ఎల్తపు వైష్ణవిని బరిలో నిలిపాడు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ రోజున సమీప ప్రత్యర్థి గుర్రాల మాధవి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో వైష్ణవి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.


