మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి చేసిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అయ్యప్ప దీక్షలో ఉన్నందున నల్ల దుస్తులు ధరించి కాలేజీకి వచ్చినప్పుడు, సిబ్బంది తనను బలవంతంగా నల్ల దుస్తులు విప్పించి యూనిఫాంలోకి మార్చారని ఆ స్టూడెంట్ ఆరోపించాడు.
తాను అయ్యప్ప మాల ధరించిన కారణంగా కాలేజీ సిబ్బంది అభ్యంతరం తెలిపారని.. రూల్స్ అంటూ దుస్తులు విప్పించారని.. దీక్షలో ఉన్నప్పుడు నల్ల దుస్తులు, మాల తీసేయడం అనుచితమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతర మతస్తుల సంప్రదాయాలను గౌరవిస్తున్న కాలేజీ యాజమాన్యం.. అయ్యప్ప దీక్ష చేస్తున్నవాళ్ల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తోందంటూ సదరు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు వీడియో తీసుకుని తనకు తెలిసినవాళ్లకల్లా పంపాడు. అలా.. అది నెట్టింటకు చేరింది.
ఈ ఘటనలో వాస్తవమేంటో నిర్ధారణ కావాల్సి ఉంది. కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. అయితే.. ఈలోపు వీడియో దుమారం రేపడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. బీజేవైఎంతో కలిసి కాలేజీ ముట్టడికి పిలుపు ఇచ్చాయి.


