జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఇదే పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ కుమ్మరి వైశాలి పోటీ చేస్తోంది. జనరల్ మహిళకు రిజర్వు అయిన ఈ స్థానం నుంచి గురువారం జైపూర్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేసింది. ప్రజలు తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రభుత్వ నిధులతో ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చింది.
బరిలో తోడికోడళ్లు...
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని టీకానపల్లి పంచాయతీలో తోడికోడళ్లు సర్పంచ్ పదవికోసం పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన బద్రి రమేశ్ భార్య సౌజన్య బీఆర్‌ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా అతని సోదరుడు బద్రి వేణు భార్య లక్ష్మి బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా మాధవరపు శైలజ పోటీలో ఉంది. మరి ముగ్గురిలో విజయం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వార్డుసభ్యుల బరిలో దంపతులు
లక్ష్మణచాంద: దంపతులిద్దరూ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. మండల కేంద్రంలోని 4 వార్డు సభ్యురాలిగా ఆప్క వనజ పోటీ చేస్తుండగా ఆమె భర్త ఆప్క సంతోష్ 8వ వార్డు సభ్యుడిగా బరిలో నిలిచారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఒకేసారి వేరువేరు వార్డుసభ్యులుగా పోటీ చేయడం మొదటిసారి అని పలువురు చర్చించుకుంటున్నారు.


