ఆసక్తికరంగా మ్యానిఫెస్టో..
విద్యార్థులకు ట్యాబ్‌లు..
యువత, మహిళలకు ఉపాధి
పంచాయతీ బరిలో అభ్యర్థి∙హామీలు
సంగారెడ్డి టౌన్: ఒకప్పుడు పల్లెల్లో రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. ఇది ఎన్నికల ఉత్సాహం మాత్రమే కాదు, గ్రామాల్లో నాయకత్వ మార్పునకు, అభివృద్ధిలో భాగస్వామ్యానికి యువత ముందుకు వస్తున్నామని చెబుతున్నారు. సంగారెడ్డి మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులుగా అక్కడక్కడ యువకులు పోటీ పడుతున్నారు. మండలంలోని పసల్వాది గ్రామంలో 27 ఏళ్ల యువకుడు హరి ప్రసాద్ ముదిరాజ్ ఎంబీఏ పూర్తి చేశాడు.
సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పంచభూతాల సాక్షిగా ఐదు హామీలు అంటూ మ్యానిఫెస్టో విడుదల చేశాడు. పట్టణాలకు దీటుగా తన గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని సరికొత్తగా ఎన్నికల వ్యూహాన్ని రచించి ముందుకు వెళుతున్నాడు. తాను గెలిస్తే గ్రామంలో ఇంటింటికి ఉచిత వైఫై, విద్యార్థులకు ట్యాబ్‌లు, యువతకు ఉపాధి, మహిళలకు ఉపాధి శిక్షణ, గ్రామంలో బస్సులు ఆగేలా బస్ స్టాప్, వివిధ రకాల సదుపాయాలు కల్పిస్తానని సరికొత్త మ్యానిఫెస్టోను రూపొందించుకొని ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీంతో మండల వ్యాప్తంగా ఈ యువకుడి ప్రచారం ఆసక్తిని కలిగిస్తోంది.


