అమెరికా, యూకే, యూఏఈ తదితర దేశాల నుంచి రానున్న అతిథులు
26 సెషన్లలో 15 వ్యూహాత్మక రంగాల విజన్‌పై జరగనున్న చర్చలు... జీసీసీలతోపాటు పెట్టుబడులపై కీలక ప్రకటనలు
మజుందార్ షా, పీవీ సింధు, రిషబ్‌శెట్టి సహా పలువురు ప్రముఖుల ప్రసంగాలు... ఏడీబీ, ప్రపంచ బ్యాంకు, కాన్సులేట్ల నుంచి హాజరుకానున్న వక్తలు
‘రైజింగ్ విజన్ 2047’ షెడ్యూల్‌పై ప్రభుత్వం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వహణ ఏర్పాట్లను ఆదివారంలోగా పూర్తి చేసేందుకు యంత్రాంగం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎక్కడా నిర్వహణ లోపం తలెత్తకుండా ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సదస్సులో ఆవిష్కరించనున్న ‘తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్’కు తుది మెరుగులు దిద్దుతోంది. మరోవైపు సదస్సులో పాల్గొనే వక్తలు, హాజరయ్యే ప్రతినిధుల జాబితా కూడా సిద్ధమైంది. సదస్సుకు 42 దేశాల నుంచి 1,686 ప్రతినిధులు హాజరు కానున్నారు. వారిలో 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్నారు. యూఏఈ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ తదితర దేశాల నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొననున్నాయి.
ప్రధాని రాక అనుమానమే
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ తదితరులను సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆహ్వనించడం తెలిసిందే. అయితే పార్లమెంటులో సోమ, మంగళవారాల్లో ఓటర్ల జాబితా సవరణ, వందేమాతరంపై చర్చ నేపథ్యంలో సదస్సుకు ప్రధాని హాజరయ్యే అవకాశాలు లేవని అధికార వర్గాల సమాచారం. కాంగ్రెస్ కూడా విప్ జారీ చేయడంతో ఆ పార్టీ ఎంపీలు కూడా సదస్సుకు హాజరయ్యే అవకాశం లేనట్లు తెలిసింది. మరోవైపు ఇతర రాష్ట్రాల సీఎంలను గ్లోబల్ సదస్సుకు ఆహ్వనించేందుకు పలువురు మంత్రులు శుక్రవారం ఆయా రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారు.
ప్రారంభోత్సవ అతిథులు వీరే..
ఈ నెల 8న మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ప్రారంభ సమావేశంలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తోపాటు బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కె. బెరి, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచత చువాంగ్‌శ్రీ, ట్రంప్ మీడియా–టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్ అతిథులుగా పాల్గొననున్నారు. అయితే ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో పాల్గొనే అతిథులు, ప్రతినిధుల జాబితాలో స్వల్ప మార్పుచేర్పులు ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బగ్గా, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈవో సదస్సులో వర్చువల్‌గా పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
సాంకేతిక రంగం నుంచే ఎక్కువ మంది...
ఈ సదస్సుకు 1,686 ప్రతినిధులు హాజరవుతుండగా వారిలో 198 మంది (11.7 శాతం) ఐటీ, సాంకేతిక రంగాలకు చెందిన వారే కావడం గమనార్హం. ప్రతినిధుల్లో ప్రభుత్వాధికారులు, రాయబార కార్యాలయ ప్రతినిధులు 75 మంది (4.4 శాతం), ఆరోగ్య, ఫార్మా రంగాలకు చెందిన వారు 66 మంది (3.9 శాతం), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు 55 (3.3 శాతం), వ్యవసాయం, ఆహార భద్రతా రంగాల నుంచి 3.1 శాతం మంది హాజరవుతున్నారు. హైదరాబాద్ నుంచి 704 (41.8 శాతం), జాతీయ స్థాయిలో 727 మంది (43.1 శాతం), అంతర్జాతీయ స్థాయిలో 255 మంది (15.1 శాతం ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారు. గూగుల్, అమెజాన్‌తోపాటు అనేక జీసీసీల ప్రతినిధులు ఇందులో ఉన్నారు.
26 అంశాలపై చర్చాగోషు్టలు..
సదస్సులో భాగంగా సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, ఆర్థిక వృద్ధి సహా వివిధ అంశాలపై 26 చర్చాగోష్టులు ఉంటాయి. ఏకకాలంలో 15 రంగాలకు చెందిన అంశాలపై చర్చాగోషు్టలు నిర్వహించేందుకు నాలుగు సమావేశ మందిరాలు సిద్ధం చేస్తున్నారు. కాలుష్యరహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, టెక్ తెలంగాణ, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ, ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్, టాలెంట్ మొబిలిటీ, గిగ్ ఎకానమీ, ఒలింపిక్స్, సాంస్కృతిక, పర్యాటకం, మూసీ పునరుద్ధరణ, భారత్ ఫ్యూచర్ సిటీ, వ్యవసాయం వంటి అంశాలపై చర్చాగోషు్టలు జరగనున్నాయి.
దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడాతో వ్యూహాత్మక సంబంధాలపై ప్రత్యేకంగా చర్చ ఉండనుంది. కిరణ్ మజుమ్‌దార్ షా (బయోకాన్), పీవీ సింధు (ఒలింపిక్ చాంపియన్), రితేశ్ దేశ్‌ముఖ్, రిషబ్ శెట్టి (వినోద రంగం), సతీశ్‌రెడ్డి (ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా), ఆర్వింద్ సుబ్రహ్మణ్యం (పెటర్సన్ ఇన్‌స్టిట్యూట్), రజత్ గుప్తా (మెకిన్సీ భాగస్వామి), బీవీఆర్ సుబ్రమణియం (నీతి ఆయోగ్ సీఈఓ) తదితర ప్రముఖులు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు అధికారులు చర్చాగోష్టుల్లో ప్రసంగించనున్నారు. సెమీకండక్టర్ల రంగంలో భాగస్వామ్యాలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల విస్తరణ, ఇండో–పసిఫిక్ వాణిజ్య సంబంధాల బలోపేతం, తెలంగాణ నెట్–జీరో లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ప్రాజెక్టుల వేగవంతం వంటి కీలక విధాన ప్రకటనలు, పెట్టుబడుల ఒప్పందాలు సదస్సు వేదికగా జరగనున్నాయి.


