ఉచిత హామీలు.. హామీలపై బాండ్లు
సాక్షి, నెట్‌వర్క్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. అభ్యర్థులు వినూత్న రీతుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ‘ఉచితం’ ఎరలు తెరపైకి వస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు అభ్యర్థులు ‘ఫ్రీ’ అంటూ గాలం వేస్తున్నారు. మరికొందరు తమ వాగ్దానాలకు సంబంధించి బాండ్లు సైతం రాసిస్తుండటం విశేషం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ప్రచారం సాగిన తీరు, తాజా పరిణామాలకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు..
సోలార్ ప్యానెల్..డిజిటల్ స్క్రీన్
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో సర్పంచ్ అభ్యర్థి చిల్లంచర్ల విద్యాసాగర్.. ప్రత్యేకంగా సైకిల్‌కు డిజిటల్ స్క్రీన్, సోలార్ ప్యానల్ బిగించి లైటింగ్ ఏర్పాటు చేసుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అర్వపల్లిలోని వై జంక్షన్‌లో డిజిటల్ స్క్రీన్ ద్వారా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం సాగించారు.
ఫ్రీ వైఫై, టీవీ చానల్స్.. బాండ్ రాసి మరీ..
నిన్న ఒకాయన నా భార్యను గెలిపిస్తే కటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానంటూ ఇచ్చిన హామీ చూసి స్ఫూర్తి పొందాడో..ఏమో.. ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలిపిస్తే ఐదేళ్ల పాటు గ్రామంలోని ప్రజలకు వైఫై, టీవీ ఛానల్స్‌ను ఉచితంగా ఇస్తానంటూ.. బీజేపీ బలపర్చిన అభ్యర్థి వినుకోలు ధనలక్ష్మి చక్రవర్తి హామీ ఇచ్చారు. ఈ మేరకు బాండ్ పేపర్ సైతం రాసి ప్రజలకు ఇచ్చారు. ఉచితంగా ఇస్తాననడంతో పాటు బాండ్ కూడా రాసివ్వడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
అభివృద్ధికి కట్టుబడతానంటూ..
‘అక్రమాలకు పాల్పడితే ఆస్తి జప్తు చేసుకోవచ్చ ని బాండ్ పేపర్ మీ చేతిలో పెడు తున్నా ..’ అని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేట సర్పంచ్ అభ్యర్థి చేర్యాల వాణి గ్రామ ప్రజలకు చెప్పారు. గ్రామానికి సేవకురాలిగా పని చేస్తానని, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా గ్రామాభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని ఆ బాండ్ పేపర్‌లో వాణి పేర్కొన్నారు.
100 రోజుల్లో అన్నీ.. లేకుంటే రాజీనామా
పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను.. సర్పంచ్‌గా గెలిచిన తర్వాత వంద రోజుల్లో నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేస్తానంటూ ఓ అభ్యర్థి బాండ్ పేపర్‌పై సంతకం పెట్టి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ అభ్యర్థి బిట్ల విజయలక్ష్మి మహేశ్ బాండ్ పేపర్ పై సంతకం చేసి మరీ ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయకుంటే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేయడం స్థానికుల్ని ఆకట్టుకుంటోంది. ఈ మేరకు వాల్ పోస్టర్లు సైతం ప్రింట్ చేశారు.
అన్నీ ఏకగ్రీవమే..
జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని 8 వార్డులకు గాను 1నుంచి 3 వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలు కావడంతో..ఈ మూడు వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 5 వార్డులకు 12 మంది నామినేషన్లు వేశారు. అయితే ఒకరు అభ్యర్థి కులం ధ్రువీకరణ పత్రం (ఎస్టీ) జత పరచలేదు. మరో ఆరుగురు ప్రకటనదారు (అభ్యర్థి) స్థానంలో సాక్షి సంతకాలు చేయడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో మిగిలిన ఐదు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి.
కార్ల కాన్వాయ్‌తో హల్‌చల్
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్‌లో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రవియాదవ్ హల్‌చల్ చేశారు. శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి మహ్మద్‌నగర్ నుంచి కౌడిపల్లి వరకు 22 ఫారŠూచ్యనర్ కార్లతో పాటు మరికొన్ని కార్లతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఇది మండలంలో చర్చనీయాంశంగా మారింది.
పొంగులేటి స్వగ్రామం.. మళ్లీ అంతా ఏకగ్రీవం
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగియగా సర్పంచ్ సహా పది వార్డుసభ్యుల స్థానాలకు ఒక్కో నామినేషనే దాఖలైంది. సర్పంచ్‌గా గొల్లమందల వెంకటేశ్వర్లును గ్రామస్తులు, అన్నివర్గాల ప్రజలు ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు.
గ్రామానికి చెందిన పొంగులేటి మహేందర్‌రెడ్డి, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి సమక్షంలో గ్రామస్తులంతా సర్పంచ్‌గా వెంకటేశ్వర్లుతో పాటు పది మంది వార్డుసభ్యులను ఎంపిక చేయగా..వారు చివరిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. నారాయణపురం గ్రామ పంచాయతీ పాలకవర్గాలు గత 25 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతుండటం గమనార్హం..కాగా ఈ ఆనవాయితీని గ్రామస్తులు ఈసారి కూడా కొనసాగించారు.


