సర్పంచ్, వార్డు స్థానాలకు తీవ్రం అవుతున్న పోటీ
ఓటర్ల మద్దతు కూడగట్టే యత్నాలు ముమ్మరం
సోమవారంతో తొలివిడత ఎన్నికల ప్రచారం ముగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పల్లెపోరు జోరందుకుంటోంది. ఈ నెల 11న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఊపందుకుంది.అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ సర్పంచ్ పదవులు, వార్డు సభ్య స్థానాలకు పోటీ తీవ్రం కావడంతో అభ్యర్థులు ఓటర్లను కలుసు కుని మద్దతును కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొదటిదశలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు నోటిఫై చేయగా 5 చోట్ల నామినేషన్లు పడలేదు. 395 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3,836 సర్పంచ్ పదవులకు 13,127 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక 37,440 వార్డుసభ్య స్థానాలకు గాను 149 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు 67,893 మంది పోటీపడుతున్నారు. వచ్చే సోమవారంతో తొలివి డత ఎన్నికల ప్రచారం ముగియనుంది.
2, 3 విడతలకు నామినేషన్ల జోరు..
ఈ నెల 14, 17 తేదీల్లో జరగనున్న రెండు, మూడు విడతల ఎన్నికలకు సంబంధించి భారీగా నామినేషన్లు పడ్డాయి. 17న జరగనున్న మూడోవిడత ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల సమర్పణ గడువు ముగిసింది. బుధ, గురువారాల్లో అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్ పత్రాలు సమరి్పంచారు. ఈ విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్న 4,158 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 9,870 నామినేషన్లు, 36,442 వార్డుసభ్య స్థానాలకు 28,042 నామినేషన్లు పడ్డాయి.
శుక్రవారం కూడా పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్టు అధికారవర్గాల సమాచారం. పలు గ్రామాల్లో రాత్రివరకు క్యూలైన్లలో నిలుచుని నామినేషన్లు వేయడంతో, మొత్తంగా అందిన నామినేషన్ పత్రాల సమాచారం ఇంకా జిల్లాల నుంచి ఎస్‌ఈసీకి చేరలేదు. మూడోరోజుల పాటు దాఖలైన నామినేషన్ల పరిశీలన పూర్తయ్యాక ఈ విడతకు సంబంధించిన మొత్తం వివరాలు శనివారం వెల్లడికానున్నాయి. 9న ఉపసంహరణలు ముగిశాక ఎన్ని సర్పంచ్ స్థానాలు, వార్డులు ఏకగ్రీవం అయ్యాయనే సమాచారాన్ని ఎస్‌ఈసీ వెల్లడించనుంది.
సాయంత్రానికి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మూడోవిడతలో.. రెండురోజుల నామినేషన్ల దాఖలు వివరాలను బట్టి చూస్తే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 269 సర్పంచ్ పదవులకు 596 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారు స్థానాలకు నామినేషన్లలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 1,959 నామినేషన్లు దాఖలయ్యాయి.


