గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంఅందించిన స్ఫూర్తితో ముందుకు నడవాలి
స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోండి
గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేయండి
సాక్షి, హైదరాబాద్: ‘మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు. కొన్ని కష్ట సమయాలు వచ్చినప్పుడు వాటికి భయపడకూడదు. మళ్లీ వచ్చేది మన బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తాయి. అప్పటివరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడవద్దు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలి..’అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిశారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కేసీఆర్ ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనను కలిసిన రెండు గ్రామాల నూతన పాలక మండళ్ల సభ్యులతో కేసీఆర్ మాట్లాడారు. ‘కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్‌లు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకుని ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసి పల్లె అభివృద్ధికి పాటు పడాలి’అని సూచించారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని అన్నారు.
స్వయం సమృద్ధి కేంద్రాలుగా గ్రామాలు
‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గ్రామాల అభివృద్ధి కోసం అనేకమంది గొప్ప వ్యక్తులు కృషి చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత, ప్రొఫెసర్ యూనిస్, మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికులు పల్లెల ప్రగతి కోసం పాటు పడ్డారు. వారిని ఆదర్శంగా తీసుకుని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చి దిద్దుకోవాలి. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయి.
దళిత, గిరిజన, బహుజన, మహిళా వర్గాలకు, కుల వృత్తులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందించింది. గ్రామీణ అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేసి పల్లె ప్రగతికి ఆర్థిక సహకారం అందించింది. తెలంగాణ పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాం. బీఆర్‌ఎస్ సర్కారు దార్శనికతతో చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి..’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచ్ నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్, నర్సన్నపేట సర్పంచ్ గిలక బాల నర్సయ్య, వార్డు సభ్యులను కేసీఆర్ శాలువాలతో సత్కరించి మిఠాయిలు పంచారు. రెండు గ్రామాల నుంచి హాజరైన పలువురిని కేసీఆర్ పేరుపేరునా పలకరించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో పరిస్థితులు దిగజారాయి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్తులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారు. పదేళ్ల పాలనలో వర్ధిల్లిన గ్రామాల్లో పరిస్థితులు కాంగ్రెస్ పాలనలో దిగజారాయని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కుల వృత్తులకు ఆర్థిక సహాయం, పింఛన్లు, రైతుబంధుతో పాటు అనేక సంక్షేమ పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయన్నారు.


