సర్పంచ్, వార్డు ఎన్నికలంటూ డబ్బు, సమయం వృథా చేసుకోవద్దు
ఉద్యోగాలు సాధించండి.. రాజకీయ కక్షలకు బలికావొద్దు
కొనుక్కుంటే పదవులు రావు.. ప్రజల మనసు గెలిస్తేనే వరిస్తాయి
రూ. 532.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సాక్షి, వరంగల్: ‘ఊర్లలో సర్పంచ్, వార్డు ఎన్నికలని చదువుకున్న యువకులు సమయం వృథా చేసుకోకండి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. రాజకీయాల్లో ఏదో ఒక పదవికి ఎప్పుడైనా పోటీ చేయవచ్చు. వయసు నిబంధనలేమీ ఉండవు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వ స్తుంది. కాబట్టి మొట్టమొదట పోటీపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. అవీ కాకపోతే ప్రైవేటు ఉద్యోగాలు మంచివి చేయండి. అప్పుడే మీరు, మీ కుటుంబాలు బాగుపడతాయి. మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి, రూపాయి కూడబెట్టి.. కష్టపడి మిమ్మల్ని పీజీలు, పీహెచ్‌డీలు చదివించింది మీరు పల్లెలకు వచ్చి రాజకీయ కక్షలకు బలికావడానికి కాదు.
గ్రామాల్లో ఉన్న యువకులు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పోటీ చేయండి. కానీ డబ్బులు ఖర్చు చేయకండి. కొనుక్కుంటే పదవులు రావు. ప్రజల మనసు గెలిస్తే ఆటోమేటిక్‌గా వస్తాయి. అందుకు నేనే ఉదాహరణ’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన–ప్రజావిజయోత్సవ సభలో సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు నర్సంపేటకు చేరుకున్న సీఎం రేవంత్.. మొత్తం రూ. 1,023 కోట్ల వివిధ అభివృద్ధి పనులకుగాను రూ. 532.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రభుత్వం భూములు ఇస్తదనో, ఆస్తులు పంచుతుందనో ప్రజలు ఆశలు పెట్టుకోవద్దని.. ఇంట్లో కొడుకో, బిడ్డో ఐఏఎస్ అయితే మీ భవిష్యత్ తరాలు మారతాయని చెప్పారు. త్వరలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు.
ఉద్యమ స్ఫూర్తితో రెండేళ్ల పాలన పూర్తి..
‘ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. కాకతీయుల పరిపాలన, సమ్మక్క–సారలమ్మల పొరాటం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన పూర్తి చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనుకొని పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగిస్తే ఆ పార్టీ నాయకుల అభివృద్ధి, ఆస్తులే పెరిగాయి. నాడు వరి వస్తే రైతులు ఉరేసుకోవాల్సిందేనని కేసీఆర్ అన్నాడు. నేడు అదే రైతులు వరి పండిస్తే చివరి గింజ వరకు మా ప్రభుత్వం కొనడంతోపాటు సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తోంది. ఇప్పుడు వరి దిగుబడిలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగంలో ఉంది’అని సీఎం రేవంత్ అన్నారు.
వై.ఎస్. తెచ్చిన ఉచిత విద్యుత్ పేటెంట్ మాది..
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు బంద్ అయిపోతది.. రైతు రుణమాఫీ అబద్ధమని, కరెంట్ ఉండదని గడీలలో ఒంకణాలు పలికిన వారికే ఇప్పుడు పవర్ లేదు. మేం దుక్కిదున్నే ప్రతి రైతుకూ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ పారీ్టది. 2004లో దేశంలోనే తొలిసారిగా ఉచిత కరెంట్ ఇస్తామని ఆనాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి తొలి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారు. రూ. 1,200 కోట్ల రుణమాఫీ చేయడమే కాకుండా రైతులపై ఉన్న వందలాది క్రిమినల్ కేసులను వై.ఎస్. ఎత్తేశారు.
ఇదే విధానాన్ని ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలనలోనూ అందిస్తున్నాం’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ. 20,614 కోట్లతో రుణమాఫీ చేశామని.. రైతు భరోసా పథకం కింద 3 నెలల కిందట రూ. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించామని చెప్పారు. కోటీ 10 లక్షల రేషన్‌కార్డుల ద్వారా 3.10 కోట్ల మంది లబి్ధదారులకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. మహిళలకు ఇప్పటికే 65 లక్షల ఇందిరమ్మ చీరలు అందించామని.. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మార్చిలో 35 లక్షల చీరలు అందిస్తామని సీఎం వివరించారు.
నెహ్రూ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం
‘ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ప్రాధాన్యంగా తీసుకున్న తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను ఆదర్శంగా తీసుకున్నాం. దేశంలో గొప్ప యూనివర్సిటీలు కాంగ్రెస్ పార్టీ కట్టినవే. కాంగ్రెస్ కట్టిన కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎందరో మేధావులు వచ్చారు. నాగార్జునసాగర్, శ్రీశైలంతోపాటు ఎస్సారెస్పీ కూడా నెహ్రూ మొదలుపెట్టిన ప్రాజెక్టే. అందుకే మేం కూడా ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్‌కు ప్రాధ్యామిస్తున్నాం’అని సీఎం రేవంత్ చెప్పారు.
వరంగల్‌నూ హైదరాబాద్‌లా అభివృద్ధి చేస్తాం
హైదరాబాద్‌లో జరిగే అభివృద్ధి వరంగల్ నగరంలోనూ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్‌రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులను మార్చి 31లోగా ప్రారంభిస్తామని తెలిపారు. ‘తెలంగాణ అభివృద్ధికి నిధుల కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్తా.. అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. కొట్లాడుతా. ప్రజలు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొడతా’అని రేవంత్ స్పష్టం చేశారు.
మంచోళ్లకు జిమ్మేదారి ఇవ్వండి..
‘పంచాయతీ ఎన్నికల్లో మీరు ఎన్నుకునే సర్పంచ్ మీ మంత్రి దగ్గర కూర్చొని నిధులు తేవాలి. మంచోళ్లకు జిమ్మేదారి ఇవ్వండి. క్వార్టర్, హాఫ్‌కు ఇస్తే అగమాగం అవుతారు’అని ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రతి ఊరికీ రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో రూ. 20 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచి్చస్తోందని చెప్పారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జ్ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. ప్రతిపక్షాలు విషం కక్కుతున్నా.. ప్రజాసంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి పాటుపడుతున్నారని చెప్పారు. ఈ సభలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


