సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయనను ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ మాట్లాడారు.
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని కొన్ని కష్ట సమాయాలు వస్తాయని, వాటిని తట్టుకోవాలని తెలిపారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటి వరకూ ప్రజలు అధైర్యపడొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని, ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఇక 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ సీఎం పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన పెద్దగా పబ్లిక్‌గా కనిపించలేదు. 2023 డిసెంబర్ 4న గజ్వెల్‌లో తన ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆపై 2025 జూన్ 11న, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న జ్యుడీషియల్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఇలా చాలా అరుదుగానే కేసీఆర్ బయటకొస్తున్నారు. తాజాగా తెలంగాణలో పలు గ్రామ పంచాయతీలలో బీఆర్‌ఎస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లతో కేసీఆర్ సమావేశం అవ్వడమే కాకుండా వారిలో జోష్ నింపే యత్నం చేశారు.


