సాక్షి వరంగల్ : రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు రైతు రుణమాఫీ జరగలేదని ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ జరిపామన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా నర్సంపేటలో నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి హన్మకొండ-మహబూబాబాద్ నాలుగు లేన్ల రోడ్డు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో పేదలకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం 4 లక్షల50 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను పేదలకు మంజూరు చేసిందని తెలిపారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంచడానికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన పేటేంట్ కాంగ్రెస్ కే దక్కుతుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
వరంగల్ అభివృద్ధిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కానీ ప్రజా ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ మాదిరి వరంగల్ ను అభివృద్ది చేయాలని యోచిస్తుందని తెలిపారు. వరంగల్ లో ఎయిర్ పోర్టును మార్చి 31లోగా నిర్మిస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ అన్నారు.


